బాసర ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు : కేసీఆర్

kcr adb aఆదిలాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి-27) ఆదిలాబాద్ లో పర్యటించారు సీఎం. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. బాసర ఆలయం అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా జిల్లా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని సీఎం ఆగ్రహం వెలిబుచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక కాలువలు, రిజర్వాయర్లను పునరుద్ధరించామని గుర్తు చేశారు. ఇక్కడ చెరువులను పునరుద్ధరించడంతో.. 20 వేల ఎకరాల ఆయకట్టు వచ్చిందన్నారు. గతంలో ఎలక్షన్లు వచ్చిందంటే లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు విషయంలో పెద్ద డ్రామాలు ఆడారు. కాంగ్రెస్ నేతలు తెలివి తక్కువ తనంతో పని చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి.. 50 ఏండ్లుగా కొనసాగుతున్న లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టుపై ఉన్న ప్రతిష్టంభనను తొలగించామని తెలిపారు. ఈ సంవత్సరంలోనే లోయర్ పెన్‌గంగా నీళ్లను ఆదిలాబాద్ జిల్లాలో పారిస్తామని తెలిపారు. సాత్నాల ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు అందబోతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 28 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆరు నెలలో 70 వేల ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు రూ. 75 కోట్లు కేటాయిస్తామని సీఎం వెల్లడించారు.

బోథ్ నియోజకవర్గంలో రూ. 210 కోట్లతో గోముత్రి రిజర్వాయర్ నిర్మాణం చేపడుతామన్నారు. దీని ద్వారా బోథ్, ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కడెం ప్రాజెక్టుకు రూ. 870 కోట్లు మంజూరు చేస్తున్నాం, ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి మరో రూ. 85 కోట్లు కేటాయిస్తామన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం.. నిధులకు కొదవ లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలి.. బేధాభిప్రాయాలతో మనకే నష్టమని తెలిపారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates