బీబీనగర్ లోనే ఏర్పాటు : ఎయిమ్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ లోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం (జూలై-26) లేఖ కూడా అందింది. ఎయిమ్స్ కల సాకారమయ్యేలా కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్య శాఖమంత్రి సీ లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో భువనగిరి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ కలిసినప్పుడు కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చూపించిన స్థలాన్నే ఖరారు చేస్తున్నట్టు ఎయిమ్స్ కమిటీ సిఫారసు చేసిందని, ఆ మేరకు తెలంగాణకు కేటాయించిన ఎయిమ్స్‌ ను భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్‌ లోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. నిమ్స్ కోసం నిర్మించిన భవనాలలోనే ఎయిమ్స్ ఏర్పాటవుతుందని స్పష్టంచేశారు.

ఇప్పటికే భవనం సిద్ధంగా ఉన్నందున వైద్యసేవలు అతిత్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తెలంగాణలో వైద్యసదుపాయాల కొరతను తీర్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రాథమిక సేవలు ఏడాదిలోగా ప్రారంభించే అవకాశం ఉందని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు కేంద్రమంత్రి నడ్డా భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేంద్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమశాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న భూమితో పాటు అదనంగా మరో 49 ఎకరాలను సేకరించి భారతప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఎయిమ్స్‌ కు అవసరమైన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా 1.5 ఎంఎల్‌డీ వాటర్ సైప్లె నిరంతరం జరిగేలా చూడాలని చెప్పారు. నిమ్స్ భవనం నుంచి జాతీయ రహదారిని కలిపేందుకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం చేయాలన్నారు.

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎయిమ్స్‌ ను పోరాడి సాధించుకున్నామని భువనగిరి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. ఎంపీల సమిష్టికృషికి ఎయిమ్స్ సాధన నిదర్శనమన్నారు. తెలంగాణకు ఎయిమ్స్ అవసరమనే విషయాన్ని కేంద్రానికి తెలియజేయడంలో అనేక వేదికలను ఉపయోగించుకున్నామని తెలిపారు. పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీశామని చెప్పారు. ఎక్కడా రాజీపడకుండా మూడేండ్లపాటు ఉద్యమాన్ని కొనసాగించిన ఫలితంగా ఎయిమ్స్ కల సాకారమైందని వివరించారు. కమిటీ రెండుమూడు దఫాలుగా సమావేశమైందని, చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కేంద్రమంత్రి నడ్డా బీబీనగర్‌ లోనే ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు ఎంపీ బూర.

Posted in Uncategorized

Latest Updates