బీభత్సం చేస్తున్నారు : ఉద్రిక్తంగా మరాఠా రిజర్వేషన్ల పోరాటం

మహారాష్ట్రలో ఆందోళనలు పెంచారు మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారుతోంది. క్రాంతి మోర్చా ఆందోళనకు.. ప్రజల నుంచి మద్దతు పెరగటంతో.. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు పెరిగిపోయాయి. తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి చేరుతున్న మరాఠాలు.. షాపులు, స్కూళ్లు మూసివేయిస్తున్నారు. ఔరంగాబాద్ లో ఉదయమే భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నినాదాలు చేశారు. ఫడ్నవీస్ సర్కార్ దిగొచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు మరాఠాలు.

ఔరంగాబాద్ లో నిరసనల సందర్భంగా స్థానిక బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఓ వ్యక్తి చనిపోవటంతో.. నిన్న జల సమాధి నిరసన చేపట్టారు. ఔరంగాబాద్ బ్రిడ్జిపై రాకపోకలు అడ్డుకున్న.. మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు.. ఫడ్నవిస్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంగాపూర్, ఔరంగాబాద్, నాగ్ పూర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఓ వ్యానుకు నిప్పుపెట్టారు. కార్యకర్తలు గుండు చేయించుకుని నిరసన తెలిపారు. మరాఠాల బంద్ పిలుపుతో రెండురోజులుగా ముంబై వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. చెక్ పోస్టులు, హైవేలపై లారీలు, ట్రక్కులను అడ్డుకుంటున్నారు మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు. ఎప్పుడూ బిజీగా ఉండే హైవేపై బస్సులు, లారీల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆటోవాలాలు కూడా బంద్ పాటిస్తుండటంతో.. డ్యూటీలకు వెళ్లేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు.

మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేయిస్తున్నారు కార్యకర్తలు. ఎటువంటి సమాచారం లేకుండా స్కూళ్లు మూసివేయటంతో.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడంలేదు. బంద్ ప్రభావం ఉన్నా ఎలాగోలా స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు… యాజమాన్యాల తీరుపై మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా స్కూళ్లు మూసివేశారని అంటున్నారు. మరాఠాల నిరసనలు తీవ్రం కావటంతో పోలీసులు అలర్టయ్యారు. బంద్ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. చెక్ పోస్టుల దగ్గర భద్రత పెంచారు. అధిపార్ చెక్ పోస్టు దగ్గర పోలీసులు కవాతు నిర్వహించారు.

Posted in Uncategorized

Latest Updates