బీసీ రుణాల దరఖాస్తు గడువు పెంపు

tslogoబీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 21 వరకు గడువు పెంచింది బీసీ అభివృద్ధి శాఖ. స్వయం ఉపాధి పథకాల కోసం బీసీ కార్పొరేషన్, సమాఖ్యల నుంచి రాయితీపై రుణాలు ఇవ్వనుంది. స్వయం ఉపాధికి ఊతమిచ్చేందుకు, యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు బీసీ అభివృద్ధి శాఖ అవకాశమిస్తోంది. బీసీ కార్పోరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు అందించనుంది.

బీసీ కార్పొరేషన్ రుణాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎంబీకే మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. 21 -55 ఏండ్ల మధ్య వయస్కులు, రూ. రెండు లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు రుణాల కోసం https://tsobmms.cgg.gov.in/ లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2015-16 ఆర్థిక ప్రణాళికలో దరఖాస్తు చేసి, రాయితి పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

సబ్సిడీ మొత్తం పెంపు

బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సర్కార్ పెద్దపీఠ వేస్తూ రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తోంది. మునుపెన్నడూ లేనంతగా స్వయం ఉపాధి పథకాలపై కనివిని ఎరుగని రీతిలో సబ్సిడీ ఇస్తోంది. నిబంధనలు సడలించి అర్హులైన నిరుద్యోగుల స్వయం ఉపాధికి బంగారు బాటలు వేస్తోంది. సంక్షేమ రుణాల జారీలో అక్రమాలకు తావు లేకుండా ప్రక్రియనంతా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగా బ్యాంకుల నుంచి కాన్సెంట్‌లను తెప్పించి వీలైనంత త్వరగా రుణాలిచ్చి లబ్ధిదారులు ఎంటర్ ప్రెన్యూర్స్‌గా ఎదిగే అవకాశమిస్తున్నారు. ఇది వరకు పరిమితంగా కొన్నింటికి మాత్రమే పరిమితమైన సబ్సిడీని కొంత కాలంగా 80 పథకాలకు వర్తింపచేస్తున్నారు. ఈ ఏడాది సైతం 80 రకాల పథకాలకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిపై పెద్దఎత్తున సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేస్తోంది.

కేటగిరి-1లో లక్ష రూపాయలకు 80 శాతం రాయితీ, కేటగిరి -2లో రూ. 2 లక్షలకు 70శాతం రాయితీ, కేటగిరి -3లో రూ. 2 లక్షల నుంచి 12 లక్షల లోపు రుణానికి 60 శాతం రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అలాగే 2015-16 వార్షిక సంవత్సరం నుంచి రుణపరిమితిని గణనీయంగా పెంచారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు రూ.1 లక్ష నుంచి గరిష్టంగా రూ.12 లక్షల లోపు రుణాలివ్వనున్నారు. రుణం ఎంత తెచ్చుకున్నా గరిష్టంగా రూ. 5 లక్షల వరకు సబ్సిడీని మంజూరు చేస్తున్నారు. 33 శాతం మహిళల కోటాను అమలు చేస్తూ ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు సాయమందిస్తున్నారు.

కావాల్సినవి

– మీసేవ ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రం
– తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం
– ఆధార్‌కార్డ్
– పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
– విద్యార్హత ధ్రువీకరణ ప్రతాలు
– అభ్యర్థి ఫొటో

Posted in Uncategorized

Latest Updates