బీసీ హాస్టల్స్ లో బయోమెట్రిక్ హాజరు

బీసీ హాస్టల్స్ లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం. హాస్టల్స్ లో బయోమెట్రిక్  విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో వార్డెన్లతో పాటు విద్యార్థుల రోజువారి హాజరును తెలుసుకోనున్నారు. బయోమెట్రిక్ విధానంతో సిబ్బంది సమయపాలన, విద్యార్థుల హాజరుశాతం నమోదు అవుతుంది. దాంతో నిధుల దుర్వినియోగం కాకుండా చూడొచ్చంటున్నారు అధికారులు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ హాస్టల్స్ లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది సర్కార్. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని బీసీ హాస్టల్స్ లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించారు మంత్రి జోగురామన్న. బీసీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జాబితా ప్రకారం భోజనం పెట్టేలా సర్కార్ చర్యలు చేపడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలాచోట్ల వార్డెన్లు టైమ్ కు రావడం లేదని, సిబ్బంది ఇంటి నుంచే వ్యవహారాలు నడిపిస్తున్నారన్న  ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా.. హాజరుశాతాన్ని ఎక్కువగా చూపిస్తూ… దుప్పట్లు, కాస్మటిక్  ఛార్జీల నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇలాంటి ఆగడాలకు బయోమెట్రిక్ సిస్టమ్ తో అడ్డుకట్ట పడనుంది.

ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్  విధానం ప్రారంభమైంది. వీటికి అవసరమైన కంప్యూటర్లు, బయోమెట్రిక్ యంత్రాలు, ప్రింటర్లు కొని.. ఏ విధంగా ఉపయోగించాలో వార్డెన్లకు అవగాహన కల్పించారు. చాలా చోట్ల మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం, వార్డెన్లు అందుబాటులో ఉండకపోవడం, కిందిస్థాయి సిబ్బంది ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు హాస్టళ్లలో చేరడం లేదన్న ఆరోపణలున్నాయి. చాలా హాస్టల్స్ లో విద్యార్థులు రోజుల తరబడి హాజరుకానప్పటికీ.. వార్డెన్లు వందశాతం హాజరు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. బయోమెట్రిక్ తో ఈ అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది.

వార్డెన్లు ఉదయాన్నే మెషీన్ పై వేలిముద్రతో.. హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు రోజు టిఫిన్ చేసే సమయంలో పాటు రాత్రి భోజన సమయంలో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. సెలవు రోజుల్లో హాస్టల్స్ లో అందించే మధ్యాహ్న భోజనానికి ముందు కూడా రెండుసార్లు బయోమెట్రిక్  నమోదు చేయాల్సి ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates