బెంగాలీ రచయిత అమితావ్ ఘోష్ కు జ్ఞాన్‌ పీఠ్ అవార్డు

న్యూఢిల్లీ: దేశ సాహిత్య రంగంలో అత్యున్నతమైన జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు ప్రముఖ బెంగాలీ ఇంగ్లీష్ రచయిత అమితావ్‌ ఘోష్‌కు దక్కింది. 2018 ఏడాదికి గాను ఆయన్ను అవార్డుకు ఎంపిక చేసినట్లు భారతీయ జ్ఞాన్‌పీఠ్‌ నిన్న(శుక్రవారం) తెలిపింది. ప్రముఖ రచయిత్రి, జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత ప్రతిభా రే నేతృత్వంలోని కమిటీ ఘోష్‌ను అవార్డుకు ఎంపిక చేసింది. ‘ఘోష్‌ రచనల్లో కొత్తదనం ఉట్టి పడుతుంటుంది. గత చరిత్రను ప్రస్తుత జీవితానికి తగినట్లుగా రాయగల దిట్ట. గతంతో ప్రస్తుతాన్ని ఎంతో అద్భుతంగా కలుపుతారు. ఫిక్షన్‌ రచనల్లో లోతెక్కువుంటుంది’ అని సంస్థ తెలిపింది. అమితావ్‌ను చరిత్ర కారుడిగా, సామాజిక మానవ శాస్త్ర వేత్తగా కొనియాడింది.

1956లో కోల్‌‌కతాలోని బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించిన ఘోష్‌ చిన్నతనమంతా ఇండియా, బంగ్లాదేశ్‌, శ్రీలంకల్లో గడిపారు. ఢిల్లీ, ఆక్స్‌‌ఫర్డ్, అలెగ్జాండ్రియా యూనివర్సిటీల్లో చదువుకున్నారు. షాడో లైన్స్, ది గ్లాస్ ప్యాలెస్, ది హంగ్రీ టైడ్, సీ ఆఫ్‌ పప్పీస్‌, రివర్ ఆఫ్ ​స్మోక్, ఫ్లడ్​ ఆఫ్ ​ఫైర్ వంటి నవలలతో ఘోష్ ఫేమస్ అయ్యారు. 2016లో ‘ది గ్రేట్‌ డిరేంజ్‌మెంట్‌: క్లైమెట్ చేంజ్‌‌ అండ్‌ అన్‌థింకబుల్‌‌, ఎ వర్క్‌‌ ఆఫ్‌ నాన్‌ ఫిక్షన్‌’ బుక్ ను ఆయన రిలీజ్ చేశారు. అమితావ్‌ ఇప్పటికే కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. పురస్కారానికి ఎంపికవ్వడం పై ఘోష్‌ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. ‘అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నా. ఇది నాకు అద్భుతమైన రోజు. నేను ఆరాధించే  వ్యక్తుల పేర్లతో పాటు నా పేరూ లిస్టులో ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు’ అని ఆయన ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates