బోనమెత్తిన భాగ్యనగరం

బోనాల శోభతో హైదరాబాద్ కళకళలాడుతోంది. ఆదివారం(జూలై-15) ఆషాడమాసం సందర్భంగా గడప గడప నుంచి బోనాలు ఎత్తుకుని కదిలారు మహిళలు. గోల్కొండ అమ్మవారికి మొక్కులు చెల్లించారు భక్తులు. పోతరాజుల ఆటలు.. శిగమెత్తిన శివసత్తులు.. కళాకారుల ఆటపాటతో గోల్కొండ పరిసరాలు హోరెత్తిపోయాయి.

హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. ఆషాడ మాసం బోనాలు.. ఆగస్టు రెండో వారం వరకు కొనసాగనున్నాయి. గోల్కొండ కోటలో జగదాంబింక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు భక్తులు. నైవేద్యంగా బోనం సమర్పించేందుకు పొద్దటినుంచే వేలాది మంది మహిళలు క్యూ కట్టారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కల్లు శాకతో, జంతు బలులతో  మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు.

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి  తొలి బోనంతో లష్కర్ బోనాలు మొదలయ్యాయి. లంగర్ హౌస్  నుంచి… గోల్కొండ ఆలయం వరకు.. జగదాంబిక అమ్మవారి రథం, తొట్టెల ఊరేగింపు వైభవంగా జరిగింది. మార్గ మధ్యలో.. చోటే బజార్ లో ప్రధాన పూజారి ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. పరమత సహనం పాటిస్తూ… వేలాది మంది భక్తులు రథం ఊరేగింపులో పాల్గొన్నారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఆరు గంటలకు రథం గోల్కొండకు చేరుకుంది.

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. డిప్యూటీ సీఎం మెహమూద్ ఆలీ, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు గౌడ్, ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సహా.. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పోతురాజులతో కలిసి తలసాని స్టెప్పులేశారు. తెలంగాణ వచ్చాకే పండుగను మరింత వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు మంత్రులు. రథం, తొట్టెల ఊరేగింపులో భక్తులకు మంచినీరు, వసతి సౌకర్యం కల్పించారు. ఆలయం దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో.. 5 వందల మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.


Posted in Uncategorized

Latest Updates