బౌలర్ల తడాఖా : విజయానికి 2 వికెట్ల దూరంలో భారత్

ఆస్ట్రేలియా : మెల్ బోర్న్ లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది. అపూర్వ విజయం మరో రెండు వికెట్ల దూరంలోనే ఉంది. అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిచే పరిస్థితిలో లేదు. మరో రెండు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న ఆస్ట్రేలియా… విజయానికి మరో 141 రన్స్ చేయాల్సి ఉంది.

మొదట్లో బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై భారత జట్టు ఆటగాళ్లు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టారు. నాలుగోరోజు 54/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు… 106/8 స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 42 , రిషభ్ పంత్ 33 మాత్రమే రాణించారు. 292 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి.. ఆస్ట్రేలియాకు 399 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.

బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై 399 స్కోరు సాధించడం అసాధ్యమనేది విశ్లేషకుల మాట. అంచనాలకు తగ్గట్టే… నాలుగోరోజు కూడా భారత బౌలర్లకు ఎదురొడ్డి.. క్రీజులో నిలవడం ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కు అంత ఈజీ కాలేదు. భారత సీమర్లు, స్పిన్నర్లు తడాఖా చూపించారు. లోకల్ కంగారూలను.. కంగారుపెట్టి పెవీలియన్ కు క్యూ కట్టించారు. కానీ… తోక తెంచేందుకు మాత్రం కష్టపడ్డారు. నాలుగోరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి.. 258 రన్స్ చేసింది. జడేజా 3, షమీ, బుమ్రా చెరో 2 వికెట్లు, ఇషాంత్ శర్మ 1 వికెట్ పడగొట్టారు. ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్(103 బాల్స్ లో 61* రన్స్  ) క్రీజులో కమిన్స్ పాతుకుపోయాడు. లియాన్ అతడికి జోడీగా బ్యాటింగ్ చేస్తున్నాడు. చివరి రెండు వికెట్లు పడగొట్టేందుకు ఇండియా… ఎక్స్ ట్రా అరగంట సమయం తీసుకుంది. ఐనా.. కమిన్స్, లియాన్ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయింది. ఆదివారం ఆఖరిరోజు రెండు వికెట్లు పడగొడితే విజయం టీమిండియా సొంతమవుతుంది. 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్తుంది.

నాలుగోరోజు వరకు స్కోరు వివరాలు :

భారత్ తొలి ఇన్నింగ్స్ – 443/7 డిక్లేర్డ్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ – 151 ఆలౌట్

భారత్ రెండో ఇన్నింగ్స్ – 106/8 డిక్లేర్డ్

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ – 258/8

Posted in Uncategorized

Latest Updates