బ్యాంకోళ్లు బకరా : రూ.150 కోట్ల కోసం సంచులతో వచ్చిన కస్టమర్

bank-fraudఎవరక్కడ.. మీ బ్యాంక్ మేనేజర్ ఎక్కడమ్మా అంటూ సిబ్బందిని ప్రశ్నించాడు. తనతోపాటు తెచ్చుకున్న గోతాలను కూడా చూపించాడు. మీ బ్యాంక్ లోని నా ఖాతా నుంచి రూ.150 కోట్లు డ్రా చేయబోతున్నాను.. మీ పనులు అన్నీ కొంచెం సేపు పక్కనపెట్టి నా సంగతి చూడండి.. సెక్యూరిటీ కూడా కావాలి అంటూ బ్యాంక్ లో హంగామా చేశాడు. ఈ ఎపిసోడ్ లో మొదటి బ్యాంక్ సిబ్బంది కూడా బుట్టలో పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అతని పేరు మంగళ్ సింగ్. వయస్సు 36 ఏళ్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హపూర్ కి చెందిన వాసి. స్థానికంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో అతనికి ఖాతా ఉంది. మంగళవారం ఉదయం అతను బ్యాంకుకి వెళ్లాడు. వెంట గోతాలు కూడా తీసుకెళ్లాడు. నా ఖాతా నుంచి రూ.150 కోట్లు విత్ డ్రా చేయబోతున్నట్లు క్యాషియర్ కు చెప్పాడు. బ్యాంక్ నుంచే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు. రూ.150 కోట్లను ఇంటికి తీసుకెళ్లటానికి భద్రత కల్పించాలని.. కానిస్టేబుళ్లను బ్యాంకుకి పంపించాలని కోరాడు. ఇదంతా విన్న బ్యాంక్ సిబ్బంది తెగ ఫీలయ్యిపోయారు. విత్ డ్రా చేయటానికి కావాల్సిన ప్రొసీజర్ చెప్పారు.

అందుకు తగ్గట్టుగానే విత్ డ్రాయల్ ఫాం పూర్తి చేశారు. పెద్ద మొత్తం కావటంతో క్యాషియర్ ఈ సమాచారాన్ని బ్యాంక్ మేనేజర్ ద్రుష్టికి తీసుకెళ్లాడు. అప్పుడు ఖాతా నెంబర్ కొట్టి అకౌంట్ చెక్ చేశారు. అంతే బ్యాంక్ సిబ్బంది మొత్తం షాక్. అందులో వెయ్యి రూపాయలు కూడా లేవు. ఏడాది నుంచి ఖాతా ఆపరేట్ కూడా చేయటం లేదు. అప్పటిగానీ మనం బకరా అయ్యాం అన్న సంగతి బ్యాంక్ ఉద్యోగులకు బోధపడలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. అప్పటికే మంగళ్ సింగ్ సమాచారంతో బ్యాంక్ కు బయలుదేరిన పోలీసులు.. సగం దూరం కూడా వచ్చేశారు. బ్యాంక్ కు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

కొన్నాళ్లుగా మంగళ్ సింగ్ కు పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని.. ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నామని చెప్పారు. దీంతో ఏమీ చేయలేక అతన్ని వదిలేసి వెళ్లిపోయారు పోలీసులు. వెళుతూ వెళుతూ బ్యాంక్ ఉద్యోగుల వైపు ఓ చూపు చూసి.. నవ్వుకుంటూ వెళ్లిపోయారంట. రూ.150 కోట్ల విత్ డ్రా అనగానే మొదట చెక్ చేయాల్సింది ఖాతా వివరాలు కదా.. అవేవీ చూడకుండా అతనితో దగ్గరుండి విత్ డ్రాయల ఫారాలు నింపించటం ఏంటో అంటూ అందరూ వింతగా చెప్పుకొంటున్నారు. ఇంతకీ ఆ బ్యాంక్ ఏంటో తెలుసా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండీ..

 

Posted in Uncategorized

Latest Updates