బ్యాంక్ ఉద్యోగులా.. దోపిడీదారులా : డబ్బుల పాస్ వర్డ్ దొంగ చేతికే ఇచ్చారు

nirav-modi

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో నీరవ్ మోడీ కుంభకోణంలో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. 11 కాదు.. 17వేల 500 కోట్ల స్కాం అని ఇప్పటి వరకు తేల్చారు. బ్యాంక్ ఉద్యోగులు కొందరు నీరవ్ మోడీతో కుమ్మక్కు అయ్యి.. ఏకంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తోపాటు పాస్ వర్డ్ కూడా చెప్పారంట. సీబీఐ విచారణలో ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు విచారణ అధికారులు. దీంతో దోపిడీ ఇష్టానుసారం సాగింది. జనం డబ్బుని కాపాడాల్సిన ఉద్యోగులే.. నీరవ్ ఇచ్చే ముడుపులకు ఆశపడి.. ఏకంగా బ్యాంక్ రహస్య సమాచారాన్ని ఆయనకు చెప్పటం విడ్డూరం. ఈ వ్యవహారంలో మాజీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌ శెట్టి, సింగిల్‌ విండో క్లర్క్‌ మనోజ్‌ కరత్‌ ప్రధాన నిందితులు.

నీరవ్ ఇచ్చే కమీషన్ కోసం కక్కుర్తి పడి.. ఏకంగా బ్యాంక్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చేశారు. బ్యాంక్ అకౌంట్లకు మోడీ సిబ్బంది నేరుగా ఎంటర్ అయ్యి.. వారి ఫైల్స్ ను వాళ్లే క్లియర్ చేసుకున్నట్లు ఒప్పుకున్నారు వీరు. 2017లో 63 రోజుల్లోనే 143 LOU (లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌) జారీ చేశారు. దీంతో లక్షల డాలర్ల సొమ్మును.. వీరు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నారు. వీటి విలువ అక్షరాల రూ.9,500 కోట్లు. వాస్తవంగా ఎల్‌ఓయూ గడువు 90 రోజులు. ఈ గోకుల్‌ శెట్టి మాత్రం 365 రోజులకు ఇచ్చేశాడు.

15 సిటీస్ లోని 45 గీతాంజలి గోల్డ్ షాపులు, వర్క్‌షాపులు, ఎస్‌ఈజెడ్‌ యూనిట్లపై దాడులు చేసిన సీబీఐ అధికారులు.. డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చండీగఢ్‌, హైదరాబాద్‌, పాట్నా, లక్నో, అహ్మదాబాద్‌, చెన్నై, గౌహతి, శ్రీనగర్‌, గోవా, జైపూర్‌, జలంధర్‌ నగరాల్లోని గీతాంజలి గోల్డ్ అండ్ డైమండ్ షాపుల్లో తనిఖీలు జరిగాయి.

200 డబ్బా కంపెనీలపై ఈడీ, ఐటీ ఆరా తీస్తోంది. ఇవన్నీ నీరవ్‌ మోదీ, ఆయనకు చెందిన వ్యక్తుల పేరుపైనే ఉన్నాయి. వీటిపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. విదేశీ చిరునామాలతో ఉన్న బినామీ సంస్థలపైనా ఆరా తీస్తున్నారు. ఇప్పటిదాకా నీరవ్‌కు చెందిన 105 బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates