బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్‌ను సోమవారం(జూలై-16) ఒడిశాలోని బాలసోర్ సెంటర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. క్షిపణి జీవితకాలం పొడిగింపునకు తోడ్పడే సాంకేతికతను పరీక్షించే ధ్యేయంతో చేపట్టిన ఈప్రయోగ పరీక్షను మొబైల్ అటానమస్ లాంచర్ ద్వారా నిర్వహించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ ద్వారా 290 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించవచ్చని.. దీనిని భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించవచ్చని తెలిపారు. చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి యుద్ధ భయం క్రమంలో భారత్ రక్షణ వ్యవస్థకు ఈ క్షిపణి మనకు తిరుగులేని అస్త్రంగా నిలుస్తుందన్నారు. ఉదయం 10.17 గంటలకు నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేకపోయినా…సముద్రంలో అలలు తొమ్మిది మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నా… ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతికూల వాతావ రణంలోనూ నిర్దేశించిన మార్గంలో బ్రహ్మోస్‌ ప్రయాణించిందన్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శాస్తవ్రేత్తలను, అధికారులను అభినందించారు. డిఆర్‌డిఏ అధికారులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ బ్రహ్మోస్ ప్రయోగ పరీక్షను చూశారు. గతంలో బ్రహ్మోస్‌ను ఈ ఏడాది మే 21, 22 తేదీల్లో పరీక్షించారు. DRDO, రష్యాకు చెందిన NPOM కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మల్టీరోల్, మల్టీ ప్లాట్‌ఫాం, ఏంటీషిప్ సామర్థ్యాలు కలిగి ఉంది. ఇది భారతదేశ రక్షణ వ్యవస్థకు పెద్ద అండగా చెప్పవచ్చు.

Posted in Uncategorized

Latest Updates