బ్లాక్‌చైన్ టెక్నాల‌జీతో రాష్ట్రాభివృద్ధి: మ‌ంత్రి కేటీఆర్‌

సమాజానికి ఉపయోగపడని టెక్నాలజీ వృధా అన్నారు మంత్రి కేటీఆర్. టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం(ఆగస్టు-3) జరిగిన అంతర్జాతీయ బ్లాక్‌చైన్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఐటీ పాలసీని ప్రారంభించిందన్నారు. ఆ పాలసీ ప్రకారం 10 రంగాలపై దృష్టిపెట్టామన్నారు. ఐటీ ఆధారిత సేవలను రోజు రోజుకూ బలపరుస్తూనే ఉన్నామన్నారు. పారిశ్రామిక విప్లవంలో డిజిటల్ విప్లవం కూడా కీలకమైందన్నారు.  లేటెస్ట్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలసిస్ ఇలా ఎన్నో సాంకేతిక విప్లవాలు వస్తున్నాయన్నారు.

రాష్ట్ర అభివృద్ధిపథంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని కేటీఆర్ తెలిపారు. మానవాభివృద్ధిలో ఇదో కొత్త అధ్యాయమన్నారు కేటీఆర్. వివిధ శాఖలను ఈ కొత్త టెక్నాలజీ సమన్వయం చేస్తుందన్నారు. దీని ద్వారా నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా జరిగిన లావాదేవీలు అత్యంత పకడ్బందీగా ఉంటాయన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో విశ్వసనీయత, కచ్చితత్వం పెరుగుతుందన్నారు. ఆ టెక్నాలజీతో మోసాలను అరికట్టవచ్చు అని తెలిపారు. లావాదేవీలపై బ్లాక్‌చైన్ టెక్నాలజీ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుందన్నారు. ప్రజలకు చెందిన భూరికార్డులు, ఓటింగ్ రికార్డులు, ఆరోగ్యపరమైన రికార్డులు అన్నీ.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా సురక్షితంగా ఉంటాయన్నారు. మునుముందు బ్లాక్‌చైన్ టెక్నాలజీ విప్లవ మార్పులు తీసుకువస్తుందన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates