భక్తులతో కిటకిట : సంప్రోక్షణం తర్వాత తెరుచుకున్న ఆలయాలు

సంపూర్ణ చంద్రగ్రహనం శుక్రవారం రాత్రి నుంచి శనివారం (జూలై-28) తెల్లవారుజాము వరకు కనువిందు చేసింది. ఆకాశంలో అరుణవర్ణ చంద్రుడుని చూసి థ్రిల్ అయ్యారు. గ్రహణం వీడిన వెంటనే శనివారం (జూలై-28) ఉదయం నుంచి ఆలయాలు తెరుచుకున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలైన తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం, బాసర ఆలయాల్లో భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు.
తెల్లవారుజామున నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేస్తున్నారు భక్తులు.

తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు మొదలయ్యాయి.  చంద్రగ్రహణం తర్వాత ఆలయంలో శుద్ధి, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. సుప్రభాతం, అర్చన, తోమాల సేవలు ఏకాంతంగా నిర్వహించారు. 9 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభించారు. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న సాయంత్రం 5 గంటలకు మహాద్వారాలు మూసివేసి … తెల్లవారు జామున 4 గంటల 15 నిమిషాలకు తెరిచారు అధికారులు. దర్శనానికి అనుమతించటంతో.. కంపార్టుమెంట్లన్నీ నిండి.. బయట క్యూలైన్ లో వేచి ఉన్నారు భక్తులు. సర్వదర్శనానికి 24 గంటలు, స్లాట్ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. నిన్నసాయంతరం నిలిపివేసిన నిత్యాన్నదాన, ప్రసాద విక్రయాలను మళ్లీ ప్రారంభించింది టీటీడీ.

సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత.. సంప్రోక్షణ చేసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని తెరిచారు అర్చకులు. తెల్లవారుజామున 4 గంటలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత సుప్రభాత సేవ, గోపూజ చేశారు. శ్రీ లక్ష్మీ గణపతిస్వామికి ప్రత్యేక అభిషేకము.. శ్రీ రాజరాజేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. చంద్రగ్రహణం ముగియడంతో వారణాసికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తర్వాత విశ్వనాథుడికి గంగాజలంతో అభిషేకం చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా పవిత్ర నదుల్లో స్నానాలు చేస్తున్నారు. దీంతో ఆలయాన్ని కిటకిటలాడుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates