భర్త అత్యుత్సాహం : యూట్యూబ్ లో పురుడు.. భార్య మృతి

ఓ భర్త అత్యుత్సాహంతో ఏకంగా నెలలు నిండిన తన భార్యకు ప్రసవం చేసే ప్రయత్నం చేశాడు. ఇది కాస్తా వికటించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమిళనాడులోని తిరుపూర్‌ కు చెందిన కార్తికేయ, కృతిక దంపతులు. వీరికి ఐదేండ్ల పాప ఉంది. కృతిక రెండోసారి గర్భం దాల్చడంతో ఇంట్లోనే ఆమెకు ప్రసవం చేయాలని ప్రైవేట్ ఉద్యోగి అయిన కార్తికేయ నిశ్చయించుకున్నాడు.

ఇందుకు యూట్యూబ్, ఫేస్‌ బుక్, ఇతర మీడియాల్లో ప్రసవం ఎలా చేయాలి.. అనే కార్యక్రమాలను వీక్షించాడు. ఇంతలో కృతిక పురిటినొప్పులతో బాధపడుతుంటే కార్తికేయ వచ్చిరానీ ట్రీట్ మెంట్ చేశాడు. ఇందుకు పక్క ఇంట్లో గల తన స్నేహితుడు, అతడి భార్య సాయం కూడా తీసుకున్నాడు. పాపను ప్రసవించిన తర్వాత తీవ్ర రక్తసావం జరుగడంతో కృతిక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. అనంతరం దవాఖానలో చికిత్స పొందుతూ జూలై 22న కన్నుమూసింది. ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికగా పలువురు సీరియస్ అవుతున్నారు.  సోషల్ మీడియాతో మేలుతోపాటు కీడు కూడా అదే స్థాయిలో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సమాచారం కోసం, వంటలు నేర్చుకోవడం, ఇతర కళల అభ్యాసం వరకు యూ ట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికలను అనుసరించడంలో తప్పులేదు కానీ..ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడకూడదంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates