భవిష్యత్తులో 28 శాతం శ్లాబ్ ను తొలగిస్తాం: జైట్లీ

భవిష్యత్తులో GST మూడు పన్ను శ్లాబులే ఉంటాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. GST 18 శ్లాబ్ వరకే ఉంటుందని… 28 శాతం శ్లాబ్ ను తీసివేసే ఆలోచనలో ఉన్నామన్నారు జైట్లీ. GST మొదలై 18 నెలలు పూర్తైన సందర్భంగా ..తన ఫేస్ బుక్ పేజీలో ‘పద్దెనిమిది నెలల జీఎస్టీ’ పేరుతో ఆర్టికల్ రాశారు. 99 శాతం వస్తువులు 18 శాతం, అంతకంటే తక్కువ శ్లాబ్ లోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. GSTలో అత్యధిక పన్ను శ్లాబ్ 28 శాతాన్ని క్రమంగా తొలగిస్తామని తెలిపారు. 12, 18శాతం శ్లాబులను కూడా తొలగించి వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

GST కి ముందు చాలా వస్తువులపై 31 శాతం అంతకన్నా ఎక్కువ పన్నులు ఉండేవన్నారు జైట్లీ. దీంతో పన్ను ఎగవేత ఎక్కువగా ఉండేదని, సరకు రవాణా కూడా ఆలస్యమయ్యేదన్నారు. 2017 జులై 1న జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత 31 శాతం అంతకంటే ఎక్కువ పన్నులున్న దాదాపు 200 రకాల వస్తువులను 28 శాతం శ్లాబ్ లోకి చేర్చామన్నారు. క్రమంగా అందులోని చాలా వస్తువులపై కింది శ్లాబ్లోకి మార్చామని, సామాన్యులు ఉపయోగించే నిత్యావసర వస్తువులను సున్నా, 5 శాతం పన్ను శ్లాబ్లోకి తెచ్చామన్నారు.

నిత్యావసర వస్తువుల్లోని 1,216 వస్తువుల్లో 183 రకాల వస్తువులపై ఎలాంటి పన్ను లేదని, ఐదు శాతం శ్లాబ్ లో 308, 12 శాతం శ్లాబ్ లో 178…. 18 శాతం శ్లాబ్ లో 517 వస్తువులున్నాయని తెలిపారు. ప్రస్తుతం 28 శాతం శ్లాబ్ లో పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ వాహనాలు, మొలాసిస్, ఏసీలు, పెద్ద టీవీలు, సిమెంట్,ఆటోమొబైల్ ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో ముందు ముందు సిమెంట్‌,ఆటోమొబైల్స్ ఉన్న పన్నును కూడా తగ్గిస్తామన్నారు. 28శాతం శ్లాబ్ క్రమంగా తొలగిపోతుందని తెలిపారు జైట్లీ.

Posted in Uncategorized

Latest Updates