భారత్ దెబ్బకి ట్రంప్ విలవిల : 29 అమెరికా వస్తువులపై ట్యాక్స్ పెంపు

Medi

ఎవరైనా ఒకటే.. ఏ దేశమైనా ఒకటే.. మీరు చేస్తూ ఉంటే మేం చూస్తూ ఊరుకోం అంటూ మోడీ సర్కార్ ప్రపంచ దేశాలకు తేల్చి చెప్పింది. భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు పెంచితే.. అదే మొత్తానికి దిగుమతి చేసుకునే వస్తువులపైనా సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది. అనుకున్నట్లు మొదట అగ్రరాజ్యం అమెరికాకే దెబ్బ కొట్టింది. ఆర్థిక యుద్ధంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని.. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లు ట్రంప్ కే సవాల్ విసిరారు మోడీ. అమెరికా నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే.. మోడీ కూడా అన్నంత పని చేసి అగ్రరాజ్యం అమెరికాకు షాక్ ఇచ్చారు. తమదేశంలోకి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్‌ సర్కారు టారిఫ్‌లను పెంచింది. ఇది ఒక వెయ్యి 600 కోట్ల రూపాయల విలువైన మన దేశ ఎగుమతులపై ప్రభావం చూపనుంది.

అమెరికా పెంచిన టారిఫ్ లకు ధీటుగా.. మోడీ సర్కారు అమెరికా నుంచి దిగుమతి అయ్యే పప్పులు, స్టీల్, ఐరన్‌ ఉత్పత్తులు ఇలా మొత్తం 29 వస్తువులపై దిగుమతి పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ట్యాక్స్ లు ఆగస్ట్‌ 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. అమెరికా రక్షణాత్మక వాణిజ్య విధానాల్లో భాగంగా దిగుమతులపై టారిఫ్‌ల నిర్ణయం తీసుకోవడంతో.. ఇతర దేశాలు ఆ విధంగా ప్రతిస్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా,  చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

కస్టమ్స్‌ డ్యూటీని పెంచాలనుకుంటున్న 30 ఉత్పత్తుల లిస్టును గత వారమే ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కు భారత్‌ సమర్పించింది. వాటిపై 50శాతం వరకు ట్యాక్స్ లు పెంచాలనుకుంటున్నట్టు తెలిపింది. ఈ జాబితాలో కొన్ని రకాల మోటారు సైకిళ్లు 800సీసీ, ఆపైన సామర్థ్యం ఉన్న వాటిని కూడా తెలపగా.. కొత్త నోటిఫికేషన్‌లో మాత్రం పెంపు ప్రస్తావన లేదు. పన్నుల పెంపు ప్రభావం, అమెరికా పెంపుతో మన ఎగుమతులపై పడే స్థాయిలోనే ఉండనుంది. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్‌లు వేస్తూ ట్రంప్‌ సర్కారు ఈ ఏడాది మార్చి 9న నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై మన దేశం ఇప్పటికే WTO లో సవాలు చేసింది.

Posted in Uncategorized

Latest Updates