భారత పోర్టులు, కార్గో షిప్స్ పై దాడికి లష్కరే తోయిబా స్కెచ్

పాక్ కు చెందిన ఉగ్రవాద సంస్ధ లష్కరే తోయిబా నుంచి భారత్‌ కు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. లష్కరే ఉగ్రవాదులు తీర ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఎదురు చూస్తున్నారన్న సమాచారంతో భారత సముద్ర తీర ప్రాంతంలో అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారత్ కు 7,517కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. దీనిని నేవీ, కోస్ట్ గార్డ్ దళాలు కాపాడుతున్నాయి. లష్కరే టెర్రరిస్టులు భారత పోర్టులు, కార్గో షిప్స్‌, ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసేందుకు సముద్రంలో పొంచి ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి టెర్రరిస్టులు దీనికోసం సిద్దమవుతున్నట్లు పాకిస్థాన్‌ పై నిఘా ఉంచే అధికారులు, కౌంటర్ టెర్రరిజమ్ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. జూన్‌ నుంచి పాక్‌లోని లాహోర్‌, షేక్‌పురా, ఫైసలాబాద్‌ తదితర ప్రాంతాల్లో లష్కరే ఉగ్రవాదులకు లోతైన నీటిలో ఈదడంలో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో భారత్‌ తీర ప్రాతంలో అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌ కు చెందిన మరో ఉగ్రవాద సంస్థ జైషే ఈ మహమ్మద్‌ కూడా భారత్‌ పై దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంటుంది. జైషే కూడా ఇటీవల ఉగ్రవాదులకు ఈత, సముద్రంలో చాలా లోతులో ఈదగల సామర్థ్యాలను నేర్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు

లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్రం గుండా దాడులకు పాల్పడే అంశం కొత్తేమీ కాదు. 26/11 ముంబయి దాడుల సమయంలో కూడా ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండానే భారత్‌ లోకి ప్రవేశించారు. అయితే ఇప్పుడు లష్కరే మళ్లీ సముద్రం ద్వారా దాడులకు సిద్ధమవుతోందా అని ఆందోళన వ్యక్తమవుతోంది.

Posted in Uncategorized

Latest Updates