భారీ వర్షాలు : వణికిపోతున్న ఉత్తరభారతం

భారీ వర్షాలతో ఉత్తరభారతం వణికిపోతుంది. ఉత్తరాఖండ్, అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కుండపోత వర్షం పడుతుంది. నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బస్సులు, ఆటోలు, కార్లు వరదప్రవాహంలో కొట్టుకుపోయాయి. యమునానది ఉగ్రరూపం దాల్చటంతో హరియాణా, ఢిల్లీ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలతో డెహ్రాడూన్, ఉత్తరకాశీ హల్దివాని ప్రాంతంలో రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోంది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు వరదనీటి ఉద్దృతిలో చిక్కుకుంది. సమీప ప్రాంతంలో ప్రజలు బస్సులో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు.

అసొం రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు గౌహతిలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. విద్యుత్, ఇంటర్ నెట్ సౌకర్యాలు ఆగిపోయాయి. శివగంగ జిల్లాలో నీటిలో చిక్కుకున్న జనాన్ని NDRF సిబ్బంది కాపాడారు. బీహార్ లో నాల్గురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాల్లోకి నీళ్లు వచ్చాయి. పట్నాలోని నలంద మెడికల్ కాలేజీని ముంచెత్తిన వరద తగ్గుడంతో.. ఆస్పత్రిని క్లీన్ చేస్తున్నారు సిబ్బంది. నిన్న మోకాళ్లలోతు నీరు చేరి హాస్పిటల్ ఐసీయూలోకి చేప పిల్లలు వచ్చాయి. అంటువ్యాధులు వ్యాపిస్తాయోనన్న భయంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు.

భారీ వర్షాలకు యమునానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎలాంటి విపత్తు జరిగినా తట్టుకునేలా హరియాణా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో హరియాణాలోని పానిపట్, సోనిపట్ జిల్లాల్లో అనేక గ్రామాలు జలద్బింధంలో చిక్కుకున్నాయి. అగ్రా తాజ్ మహల్ ను చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. యమునానది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో ఢిల్లీలో అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పాత యమునా బ్రిడ్జిపై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపు 70 మందికిపైగా చనిపోయారు. 80 మంది వరకు గాయపడ్డరని అధికారులు ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates