భారీ స్కెచ్ వేశారు : ఐటీ అధికారుల పేరుతో దీప ఇంట్లో తనిఖీలు

deepa

తమిళనాడులో కలకలం. జయలలిత మేనకోడలు ఇంటిపై ఐటీ అధికారుల దాడి అంటూ వార్తలు కలకలం రేపాయి. ఫిబ్రవరి 10వ తేదీ శనివారం ఉదయం.. 10 మంది వ్యక్తులు ఇంటి తలపు తట్టారు. ఆదాయ పన్ను శాఖ నుంచి వస్తున్నాం.. మీ ఇంట్లో సోదాలు చేయాలి.. భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం ఉంది అంటూ దీపను సమాచారం ఇచ్చారు. దీంతో షాక్ అయ్యింది దీప. సరే అంటూ ఇంట్లో సోదాలకు కుటుంబ సభ్యులు అనుమతి ఇచ్చారు. అయితే వారి వ్యవహార శైలిపై అనుమానం వచ్చింది. అడిగే ప్రశ్నలు, తనిఖీ చేస్తున్న తీరు భిన్నంగా ఉంది.

వచ్చింది నిజంగా ఐటీ అధికారులేనా లేక నకిలీలా అనే విషయాన్ని క్లారిటీ చేసుకోవటానికి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీప కుటుంబ సభ్యులు. ఈ విషయం తెలుసుకున్న దోపిడీ దొంగలు.. పోలీసులు వచ్చే ఐదు నిమిషాల ముందు ఇంట్లో ఏమీ దొరకలేదని చెబుతూ వెళ్లిపోయారు. ఐటీ అధికారులు కూడా ఈ విషయాన్ని ఖండించారు. మేం ఎవరి ఇంటిపై దాడి చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులు కూడా నకిలీ వ్యక్తులు.. ఐటీ పేరుతో వచ్చారని నిర్ధారించారు. వెంటనే ప్రత్యేక పోలీస్ బ్రుందాలతో వారి కోసం వేట మొదలుపెట్టారు.

దీప ఇంట్లో భారీగా డబ్బు, విలువైన వస్తువులు దోపిడీ చేయటానికి ఈ భారీ స్కెచ్ వేశారని భావిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాలతో వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం బయటకు రావటంతో మీడియా కూడా పెద్ద ఎత్తున దీప ఇంటికి చేరుకుంది.

Posted in Uncategorized

Latest Updates