భార్య ముందే చెప్పింది : జైల్లోనే గ్యాంగ్ స్టర్ కాల్చివేత


ప్రేమ్ ప్రకాశ్ సింగ్ ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు.. అదే మున్నా భజరంగ్ అనగానే ఠక్కున గుర్తుకొస్తుంది. అంతే కాదు.. ఒంట్లో వణుకు కూడా వస్తోంది. పేరుమోసిన గ్యాంగ్ స్టర్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 40 హత్య కేసుల్లో ఉన్న నిందితుడు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. మున్నా భజరంగ్ అంటే చాలు చోటామోటా రౌడీలు అందరూ.. అన్నా అని పిలుచుకుంటారు. అలాంటి గ్యాంగ్ స్టర్ జైల్లోనే హత్యకు గురయ్యాడు. తోటి ఖైదీలే ఆయన్ను కాల్చి చంపారు. కలకలం రేపిన ఈ ఘటన జూలై 9వ తేదీ సోమవారం ఉదయం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మున్నా భజరంగీ యూపీలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్. ఎన్నో హత్యలు, కిడ్నాప్ లు, దోపిడీలు, బెదిరింపులు, కబ్జాలు చేశాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. పట్టించిన వారికి రూ.7లక్షల రివార్డ్ ఇస్తామని ప్రభుత్వమే ప్రకటించింది అంటే.. ఏ స్థాయిలో నేరాలు చేశాడో ఇట్టే చెప్పొచ్చు. అంతే కాదు.. రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. మొత్తం 40 హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మున్నా భజరంగీ.. 2009లో ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. అతన్ని ఝాన్సీ జైలులో ఉంచారు. జైలులో ఉన్నా తన హవా మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. బయట ఉన్న తన గ్యాంగ్ కు సూచనలు, సలహాలు ఇస్తూ క్రిమినల్ యాక్టివిటీస్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏ స్థాయిలో అంట.. జైలులో ఉండగానే అప్నాదళ్ పీస్ అనే పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఏకంగా 12శాతం ఓట్లు దక్కించుకుని మూడో స్థానంలోనూ నిలిచాడు. అప్పటి నుంచే ప్రభుత్వం, పోలీసులు భజరంగీపై మరింత దృష్టి పెట్టారు. కేసుల విచారణలో వేగం పెంచారు. ఈ క్రమంలోనే.. కొన్నాళ్ల క్రితం మున్నా భజరంగీని ఝాన్సీ నిం.. భాగ్ పాఠ్ జైలుకి తరలించారు.
ఇక్కడే అసలు కథ నడించింది అంటోంది డాన్ భజరంగీ భార్య సీమా సింగ్. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆందోళన వ్యక్తం చేసింది. నా భర్త హత్యకు యూపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు కుట్ర చేస్తున్నారని సీఎం యోగీకి లేఖ రాసింది. ఆరోగ్యం కూడా బాగోలేదని.. వెంటనే జైలు మార్చాలని కోరింది. దీన్ని జైళ్ల శాఖ కూడా ఖండించింది. ఇప్పుడు ఆమె భయపడినంత జరిగింది. భాగ్ పాఠ్ జైలులో గ్యాంగ్ స్టర్ మున్నా భజరంగీని కాల్చి చంపారు తోటి ఖైదీలు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జైల్లోకి తుపాకులు ఎలా వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates