మంగళవాయిద్యం.. చావు మేళం అయ్యింది : అరుంధతి నక్షత్రం చూస్తూనే.. అనంతలోకాలకు

brideవేసిన మూడు ముళ్లు గట్టి పడలేదు.. తలంబ్రాలూ నేల రాలలేదు.. పారాణి ఇంకా ఆరనేలేదు.. పెళ్లి భోజనాలు ముగియలేదు.. మంగళవాయిద్యాలు మోగుతూనే ఉన్నాయి.. పంతులు మంత్రాలు చదువుతూనే ఉన్నాడు.. ఆ నవ వధువు మాత్రం అనంతలోకాలకు వెళ్లిపోయింది. కళ్యాణ మంటపం.. విషాదంగా మారింది. నవ్వుతూ, కేరింతలు కొడుతూ, ధాంధాం చేస్తున్న బంధువులు, స్నేహితులు షాక్ లోకి వెళ్లారు.. ఊహకే అందని.. కలలో కూడా ఊహించలేని విషాదం ఆ కల్యాణ మంటపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పెళ్లి కొడుకు పేరు వెంకటేష్. పెళ్లి కుమార్తె పేరు లక్ష్మీ (బుజ్జీ). వీరిది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బుడగజంగల కాలనీ. జూలై 7వ తేదీ శనివారం ఉదయం వీరిద్దరికీ పెళ్లి చేస్తున్నారు పెద్దలు. బంధువులు, స్నేహితులు, కాలనీవాసులతో అంతా హడావిడిగా ఉంది. డాన్సులు, ఆటపాటలతో హంగామా కూడా ఉంది. వధువు మెడలో తాళి కట్టాడు వరుడు, తలంబ్రాలు పోశాడు. ఏడు అడుగులు కూడా వేశాడు.. ఆ తర్వాత బయటకు వచ్చారు. ఆకాశంలో అరుంధతీ నక్షత్రం చూపించాడు పంతులు గారు.. వధువు అలా ఆకాశం వైపు చూస్తూ కుప్పకూలిపోయింది. అందరూ షాక్. పెళ్లి హడావిడిలో ఏమీ తినలేదు.. నీరసం అనుకున్నారు. వెంటనే నీళ్లు కొట్టారు.. ఫ్యాన్ కిందకు తీసుకెళ్లారు. అయినా ఉలుకూ పలుకూ లేదు. భయపడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పెళ్లికి వచ్చినోళ్లు అంతా నిర్ఘాంత పోయారు. కళ్ల ముందు జరిగిన ఘోరాన్ని చూసి జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరు అవుతున్నారు. గుండెపోటు వల్లే చనిపోయినట్లు ప్రాథమికంగా చెబుతున్నారు వైద్యులు.

Posted in Uncategorized

Latest Updates