మండిపోతున్న ఎండలు…..ఆందోళనలో రైతన్నలు

farసీజన్ మొదట్లో మురిపించిన వానలు.. మోహం చాటేశాయి. ముందుగానే రుతు పవనాలు వచ్చాయని సంబురపడ్డ అన్నదాతల .. ఆశలు ఆవిరయ్యాయి. వానలు రాక వేసిన విత్తనాలు ఎండిపోవడంతో.. తలలు పట్టుకుంటున్నారు. కాలం కలిస్తుందని అనుకుంటే.. మరింత అప్పుల్లోకి నెట్టిందని ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్రంలో వాన జాడ లేదు. మొదట్లో మురిపించిన వానలు.. ఇప్పుడు కనిపించకుండా పోయాయి. మృగశిర కార్తె ముందు వర్షాలు జోరుగా కురవడంతో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నదాతలు సాగు పనులు మొదలు పెట్టారు. పెసర, మినుము, పత్తి, సోయ విత్తనాలు నాటారు. మళ్లీ ఇప్పటి వరకు సరైన వానలు రాకపోవడంతో.. విత్తనాలు మొలకెత్తకముందే భూమిలో మురిగిపోతున్నాయి.
వర్షాలు ఇప్పటి వరకు అనుకున్నస్థాయిలో లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు ఈ ఏడాది ముందుగా రావడంతో.. కాలం కలిసొస్తుందని ఆశపడ్డామంటున్నారు. మొదటి వానకే విత్తనాలు వేస్తే.. ఇప్పటి వరకు వానలు రాకపోవడంతో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
ప్రభుత్వం రైతుబంధు పథకంతో సాయం చేసినా.. ప్రకృతి సహకరించక నష్టపోతున్నామంటున్నారు రైతులు. మళ్లీ విత్తనాలు కొనడం, భూమి సాగు చేయాలంటే.. అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎకరానికి దాదాపు 9వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచానా వేసి.. పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. మరికొద్ది రోజులు వానలు పడకపోతే.. ఖరీఫ్ పంటలు కష్టమే అంటున్నారు రైతులు.

Posted in Uncategorized

Latest Updates