మక్తల్‍ లో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మో త్సవాలు  

మహబూబ్‍నగర్‍ : మహబూబ్‍నగర్‌ జిల్లా మక్తల్‍ పట్టణంలో వెలసిన పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మో త్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. శుక్రవారం ఉదయం ప్రభోత్సవం నిర్వహించారు. ఇవాళ(శనివారం) రథోత్సవం, రేపు పాల ఉట్లు కార్యక్రమం నిర్వహిస్తారు. వలస వెళ్నవారు సైతం ఈ జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చి జ్యోతి కార్యక్రమాన్నినిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

జాంబవంతుడు స్వయంగా ప్రతిష్ఠించిన రాతి ఆంజనేయస్వామి విగ్రహం దేశంలో ఇక్కడ మాత్రమే ఉందని ప్రతీక . అంతేకాక అన్ని విగ్రహాలు తూర్పు లేదా ఉత్తర ముఖమై ఉంటాయి. కానీ ఈ విగ్రహం పడమర దిశగా ఉండటంతో పడమటి ఆంజనేయస్వామిగా పిలువబడుతున్నాడు. ఏటా డిసెంబర్‍లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా పున్నమి రోజు రథోత్సవం నిర్వహిస్తారు. అంతేకాక జిల్లాలో మరో ఏడుచోట్ల ఒకే సమయానికి ఆంజనేయస్వామి రథోత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‍ నుంచే కాక కర్నాటక, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఆలయ ఆవరణలో 33 అడుగుల ఆంజనేయస్వామి భారీ విగ్రహాన్ని ఒక భక్తుడు ప్రతిష్ఠింపజేశారు. పాలమూరు జిల్లాలోనే ఇది అతి పెద్ద విగ్రహం కావడం గమనార్హం.

గ్రామీణ నేపథ్యం కలగలిసిన ఈ జాతరకు భక్తులు గతంలో ఎడ్లబండ్లపై తరలివచ్చేవారు. ఇప్పుడు కూడా చాలామంది భక్తులు ఎడ్లబండ్ల పై వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి స్వామివారిని సేవించుకుంటారు. ఆలయ ఆవరణలోనే స్వామివారికి ఇష్టమైన పోలేలు(భక్ష్యాలు) చేసి, గండ జ్యోతులతో స్వామివారికి కుండలో అన్నం, ఇతర పదార్థాలు వండి నైవేద్యం పెడతారు. జాతరకు ఈ ఏడాది దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త భీమాచార్య తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates