మట్టిలో మాణిక్యం : బస్ డ్రైవర్ కొడుకు.. CBSEలో స్కూల్ టాపర్

CBSEమట్టిలో మాణిక్యం అనడానికి ఈ కుర్రాడే నిదర్శనం. ఇటీవల CBSE 12వ తరగతికి సంబంధించిన ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఫలితాల్లో ఓ స్కూల్ టాపర్ గా నిలిచిన స్టూడెంట్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విద్యార్థి నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఢిల్లీ ట్రాన్స్‌ పోర్టు కార్పోరేషన్‌ లో పనిచేస్తున్న బస్‌ డ్రైవర్‌ కొడుకు శనివారం (మే-26) విడుదలైన CBSE ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. దీంతో ప్రైవేటు విద్యాలయాల్లో చదివితేనే ర్యాంకులు వస్తాయనే అపోహను పటాపంచలు చేశాడు. CBSE 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీకి చెందిన ప్రిన్స్‌ కుమార్‌ సైన్స్‌ విభాగంలో 500 మార్కులకు 485 సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్‌ గా నిలిచాడు.

ఈ సందర్భంగా..ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ట్విటర్‌ లో స్పందిస్తూ.. కుమార్‌ ప్రభుత్వ విద్యాలయాల పట్ల నమ్మకాన్ని పెంచాడని అభినందించారు. ద్వారకా
ప్రాంతంలోని సెక్టార్‌ 10లో గల రాజ్‌ కియా ప్రతిభా వికాస్‌ విద్యాలయలో విద్యనభ్యసిస్తున్న కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ప్రభుత్వం విద్యా పునర్‌వైభవానికి చర్యలు తీసుకుంటోందని చెప్పాడు. తమ పాఠశాలలో సౌకర్యాలు చాలా బాగున్నాయని.. తన విజయంలో నిపుణులైన మా ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదన్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పిల్లలు ఎక్కువగా చేరుతుంటారని… మా వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఫలితాలు బాగుంటాయని చెప్పాడు కుమార్‌. తమ పాఠశాలలో పనిచేసే మాస్టార్లు ప్రైవేటు బడుల్లో పనిచేసే వారికంటే ఉన్నత విద్యావంతులని తెలిపిన కుమార్.. ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్‌ లో ఇంజనీరింగ్‌ చేస్తానని తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates