మణిరత్నం ‘నవాబ్’ : రివ్యూ

మణిరత్నం నుంచి సినిమా వస్తోందంటే ఒకప్పుడు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూసే ప్రేక్షకులు… గత కొన్నాళ్లుగా ఆయన సినిమాలపై ఆ ఆసక్తి చూపడం లేదు. ఇందుకు కారణం గత కొన్నాళ్లుగా ఆయన తన స్థాయికి తగ్గ సినిమాలను అందించలేకపోవడమే. తాజాగా ఆయన నుంచి ‘నవాబ్’ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ ఏమిటంటే..?

నేరచరిత్ర కలిగిన భూపతి (ప్రకాష్ రాజ్) తన పవర్‌తో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. భూపతికి భార్య(జయసుధ)తో పాటు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు వరద (అరవింద స్వామి) తండ్రికి చేదోడువాదోడుగా వుంటాడు. ఇతనికి భార్య చిత్ర(జ్యోతిక)తో పాటు ఓ ప్రియురాలు(అతిథిరావ్ హైదరి). ఇక రెండో కొడుకు త్యాగు (అరుణ్ విజయ్), మూడో కొడుకు రుద్ర (శింబు) విదేశాల్లో ఉంటారు. వరదకు స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ రసూల్ (విజయ్ సేతుపతి).

హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో ఓసారి భూపతిపై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. భూపతి, అతని భార్య ఎలాగోలా ప్రాణాలతో బయటపడతారు. హత్యాప్రయత్నం చేసింది ఎవరో తేలకముందే భూపతి మరణిస్తాడు. భూపతి స్థానం కోసం ముగ్గురు కొడుకుల మధ్య ఆధిపత్య పోరు మొదలై, ఒకరు లక్ష్యంగా మరొకరి దాడులు జరుగుతాయి. ఈ పోరులో ఎవరు గెలిచారు, భూపతిపై దాడి చేసిందెవరు, రసూల్ క్యారెక్టర్ ఏంటి వంటి విషయాలే మిగతా కథ.

 

ఎవరెలా..?

అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, జ్యోతిక మెప్పించారు. ముఖ్యంగా అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి అదరగొట్టేశారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, త్యాగరాజన్, అదితి రావు, డయానా ఎర్రప్పలకు స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రహమాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎసెట్. పాటల విషయంలో కొంత నిరాశ తప్పదు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్‌ లుక్ తీసుకొచ్చింది.

ఎలా ఉందంటే..?

కొంత గ్యాప్ తర్వాత మణిరత్నం మళ్లీ మెప్పించారు అని చెప్పొచ్చు. ఆస్తికోసం, ఆధిపత్యం కోసం అన్నదమ్ముల మధ్య సాగే సంఘర్షణ ఈ సినిమాకు ప్రధానబలం. ఈ సింగిల్ లైన్ స్టోరీని ఉత్కంఠగా చూపించాడు మణిరత్నం. దర్శకుడిగా ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన మణిరత్నం, రచయితగా కథనాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది. బలమైన పాత్రలు ఉన్నప్పుడు, వారి నడుమ సంఘర్షణకు దారితీసిన బలమైన సంఘటనలు కూడా ఉండి తీరాలి. ముఖ్యంగా ముగ్గురు అన్నదమ్ములు ఎందుకంత క్రూరంగా మారారు అనే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌పై ఇంకొంత దృష్టి పెట్టాల్సి ఉంది. మొత్తానికి ఈ సినిమా సాధారణ ప్రేక్షకుడికి రుచించకపోవచ్చు కానీ మణిరత్నం మార్క్ సినిమాలు మెచ్చేవారికి తప్పక నచ్చుతుంది.

రేటింగ్: 3/5

నటీనటులు : అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ప్రకాష్ రాజ్, జయసుధ, అదితి రావు హైదరి, ఐశ్వర్య రాజేష్, డయానా తదితరులు.

రచన, దర్శకత్వం : మ‌ణిర‌త్నం

సంగీతం : ఎ.ఆర్‌. రెహ‌మాన్

సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్

మాటలు: కిరణ్

ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: మణిరత్నం – సుభాస్కరన్

తెలుగు నిర్మాత : అశోక్ వల్లభనేని

 

Latest Updates