మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలోయ్ : సకల కళావల్లభుడు తేజ్ ప్రతాప్

మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలోయ్ అన్న సినీ రచయిత మాటలను అక్షరం పొల్లుపోకుండా పాటించేస్తున్నారు ఓ లీడర్. ఆయన వేషాలు.. చేసే పనులు చూస్తే.. ఈయన రాజకీయనాయకుడా..? లేక సినీనటుడా..? అనే అనుమానం రాకమానదు. కళాకారుడు అనే పదం ఆయనకు చాలా చిన్నది. సకల కళావల్లభుడు అంటేనే సరిగ్గా సరిపోతుందేమో..! ఇంతకీ ఎవరా లీడర్..? ఆయన ప్రదర్శిస్తున్న కళలేంటీ ఇప్పుడు చూద్దాం.

తేజ్ ప్రతాప్ యాదవ్. బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీల పెద్ద కొడుకు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే. బిహార్ లోని మహువా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దిరోజులు బిహార్ ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మనిషి.. చూడ్డానికి సన్నగా కనిపించినా… మనోడి దగ్గర చాలా టాలెంట్ ఉంది.

పొలిటీషీయిన్ అంటే ఖద్దరు చొక్కా వేసుకుని ఉండాలి. కానీ రెండు రోజులుగా తేజ్ ప్రతాప్ ఖద్దర్ లో కనిపించడం లేదు. కాషాయం కట్టుకుని.. ఓ చేతిలో శూలం, మరో చేతిలో శంఖంతో దర్శనిమిస్తున్నారు. శివభక్తుడైన తేజ్ ప్రతాప్ రెండు రోజుల క్రితం శివుడి గెటప్ లో  డియోఘర్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.  పూజలు జరుగుతున్నంతసేపు శంఖం ఊదుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇలాంటి గెటప్స్ వెయ్యడం తేజ్ ప్రతాప్ కు కొత్తేం కాదు. గతంలో చాలాసార్లు కృష్ణుడి వేషం కూడా వేశారు. ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి గెటప్ లో కనిపించారు. భుజానికి శాలుగా చుట్టుకుని.. తలపాగా పెట్టుకుని.. దానిపై నెమలి పింఛాన్ని నిలబెట్టి.. చేతిలో ఫ్లూట్ తో గోపాలుడిగా మారారు.

ఇవి మాత్రమే కాదు ఈ యంగ్ లీడర్ దగ్గర చాలా కళలున్నాయి. హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ఓ వేదికపై ఫ్లూట్ వాయించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. గతేడాది తన నివాసంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లోనూ తన కళతో ఆకట్టుకున్నారు. చాలా అనుభవం ఉన్న కళాకారుడిలా పిల్లగ్రోవి ఊదారు.

ఫ్లూటే కాదు.. శంఖం ఊదడంలోనూ ఈ యంగ్ లీడర్ ఎక్స్ పర్ట్. చాలా వేదికలపై శంఖం ఊదారు. గతేడాది పాట్నాలో జరిగిన యాంటీ బీజేపీ ర్యాలీలో వేదికపై లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, ఇతర నేతల ముందే  శంఖం పూరించారు. బీజేపీ వాళ్లు శంఖం ఊదగలరా.. అంటూ సెటైర్ వేశారు. శంఖం ఊదితే  బీజేపీ నేతలకు హార్ట్ ఎటాక్ వస్తుందన్నారు తేజ్ ప్రతాప్.

తేజ్ ప్రతాప్ కు ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం తన నియోజకవర్గంలోని కర్హతియా అనే ఊరిలో.. ఓ దళితుడి ఇంటికి వెళ్లారు. అక్కడ ఓ రోజు గడిపారు. ఇంటిముందున్న బోరు దగ్గరే స్నానం చేశారు. ఓ చిన్న తువ్వాలు కట్టుకుని బోరు ముందు కూర్చుని స్నానం చేశారు. ఇది చూసేందుకు అక్కడి జనం క్యూ కట్టారు.

ఆ మధ్య ఉత్తరప్రదేశ్ లోని వృందావన్ గోశాలకు వెళ్లారు తేజ్ . లేగదూడలతో కాసేపు ఆడుకున్న ఆయన.. ఆ తర్వాత ఇదిగో ఇలా చక్కగా కూర్చుని పాలు పితికారు. యాదవ సామాజిక వర్గానికిచెందిన వ్యక్తి కాబట్టి.. చిన్నతనంలోనే పాలు పితకడం నేర్చుకున్నట్టున్నారు. చాలా ఈజీగా పని పూర్తి చేసేశారు.

ఇవన్నీ రియల్ లైఫ్ లో చేసినవే.. త్వరలో రీల్ లైఫ్ ను కూడా చూపెట్టబోతున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్. రుద్ర పేరుతో వస్తున్న సినిమాలో ఈయనే హీరో. మొన్నీమధ్యే దీనికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. పొలిటీషియన్ అయిన తేజ్ ప్రతాప్.. ఇలా తనలోని కళలను అప్పుడప్పుడు బయటపెడుతూ పబ్లిక్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates