మన సంస్కృతి, సాంప్రదాయాలు : సిటీలో ఆకట్టుకుంటున్న ఆర్ట్ గ్యాలరీలు

ARTహైదరాబాద్ లోని రైల్వేస్టేషన్లు ఆర్ట్ గ్యాలరీల్లో వెలిగిపోతున్నాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలు, గ్రామీణ ఆధారం, జీవన విధానం ఇలా అన్నిటినీ కళ్లకు కట్టేలా స్టేషన్లలో పెయింటింగ్స్ వేయించారు రైల్వే అధికారులు. లోకల్ ఆర్ట్ కు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లలోనే కాకుండా.. గుంటూరు, ధర్మవరం, విజయవాడలోనూ స్టేషన్లలో పెయింటింగ్స్ వేయిస్తున్నామని చెబుతున్నారు సదరన్ రైల్వే అధికారులు.

రైల్వే స్టేషన్లను అందమైన పెయింటింగ్స్ తో ముస్తాబు చేస్తోంది సదరన్ రైల్వే. స్టేషన్లలోని ఆర్చీలు, గోడలు పిల్లర్లను లోకల్ ఆర్ట్స్ తో ముస్తాబు చేస్తోంది. ఒకప్పుడు బూజుపట్టి కనిపించే స్టేషన్లు.. ఇప్పుడు కళాత్మక పెయింటింగ్స్ తో కట్టిపడేస్తున్నాయి. చేర్యాల పెయింటింగ్స్ స్టేషన్లకు కొత్త కళ తెచ్చిపెడుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ.. ఇలా ఏ స్టేషన్ కు వెళ్లిన చేర్యాల పెయింటింగ్స్ కనిపిస్తాయి. పల్లె అందాలు మనల్ని కట్టిపడేస్తాయి.  సంక్రాంతి పండుగ గంగిరెద్దుల విన్యాసాలు, బతుకమ్మ ఆటలు, కులవృత్తులు, వ్యవసాయం, గ్రామీణ జీవన విధానాన్ని పెయింటింగ్స్ రూపంలో మలిచారు కళాకారులు. వచ్చిపోయే ప్రయాణికులకు కొత్త అనుభూతి మిగిల్చేలా తీర్చిదిద్దారు. కాచిగూడ స్టేషన్ లోని ఆర్చీలు గోడలు ఇప్పుడు పెయింటింగ్స్ తో నిండిపోయాయి.

స్టేషన్ ముందు ఆర్చీపై వివధ రకాల నాట్య భంగిమలు స్వాగతం పలుకుతున్నాయి. అందమైన పక్షులు, వన్యప్రాణుల పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. లోకల్ ఆర్ట్, కల్చర్ ను ప్రజలు అర్ధం చేసుకోవాలన్నదే తమ ఉద్దేశమంటున్నారు రైల్వే అధికారులు. ప్రతిరోజు ఒక్క సికింద్రాబాద్ స్టేషన్ నుంచే 2లక్షల మంది వరకు ప్రయాణికులు వచ్చిపోతుంటారని చెబుతున్నారు.  ఇలాంటి పెయింటింగ్స్ తో.. దేశంలోని అన్ని ప్రాంతాల వారికి మన సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయంటున్నారు.  స్టేషన్లను ఇలా చేర్యాల పెయింట్స్ తో ముస్తాబు చేయటం బాగుందంటున్నారు ప్రయాణికులు. దూరప్రాంతాల వారికి, పిల్లలకు మన కల్చర్ గురించి తెలిసే అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. స్టేషన్లలో సౌకర్యాల కల్పనతో పాటు.. సుందరీకరణకు రైల్వేశాఖ ప్రాముఖ్యతనిస్తుందని చెబుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates