మమత మరో కిమ్‌ జాంగ్ : కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. కిమ్‌ జాంగ్ ఉన్ మాదిరిగా తనకు అడ్డొచ్చిన వారిని మమతా చంపిస్తున్నారన్నారు. సేవ్‌ డెమోక్రసీ పేరుతో రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన యాత్రను మమత ప్రభుత్వం వ్యతిరేకించారు.

బీజేపీ ఈ యాత్ర చేపట్టాలనుకుంటున్న ప్రాంతాల్లో వర్గ పోరు చెలరేగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు పేర్కొంటూ  ఆ యాత్రకు అనుమతి నిరాకరించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. యాత్ర నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అక్కడ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బీజేపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించుకోవచ్చునని, తమను ఎవ్వరూ ఆపలేరని, సుప్రీం కోర్టులో తామే గెలుస్తామని ధీమాగా చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates