మరుగుదొడ్డి కోసం తండ్రిపై పిర్యాదు

 ఆమె వయసు ఏడేళ్లే. కానీ ఆమె ఆలోచన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. రెండో తరగతి చదువుతున్న చిన్నారి హనీఫా జారా మరుగుదొడ్డి కట్టించలేదని తన తండ్రి ఇషాన్‌ ఉల్లాహ్‌ పై కేసు పెట్టింది. తన తండ్రిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరింది. ఇషాన్‌ ఉల్లాహ్‌ కుటుంబం తమిళనాడులో వేలూరు జిల్లా అంబూరు నటరాజపురంలోని పిళ్లైయారు ఆలయం వీధిలో ఉంటుంది. జారా స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. అయితే వాళ్లింట్లో మరుగుదొడ్డిలేదు. తండ్రి మరుగుదొడ్డి కట్టించకపోవడంతో తాను బహిర్భూమికి బయటకు వెళ్లాల్సి వస్తోందని.. అవమానంగా ఉందని ఆమె తండ్రిపై ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది. అయితే గతంలో తండ్రిని మరుగుదొడ్డి కట్టించమని అడిగితే పరీక్షల్లో ఫస్ట్‌‌ ర్యాంక్‌ వస్తే కట్టిస్తానని మాటిచ్చాడని, కానీ ర్యాంక్‌ తెచ్చుకున్నా కట్టించకపోవడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మాట తప్పినందుకు ఆయన్ను అరెస్టు చేయాలని పోలీసులను కోరింది. లేదంటే రాతపూర్వకంగా హామీ తీసుకోవాలంది. తన పిర్యాదును తీసుకున్న పోలీసులు చిన్నారికి నచ్చజెప్పి బంధువుల వెంట వెనక్కి పంపారు.

Posted in Uncategorized

Latest Updates