మళ్లీ రక్తం చిందిన దేవరగట్టు.. కొండపై కర్రల సమరం

కర్నూలు : దసరా ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టు కొండపై జరిగిన బన్ని ఉత్సవం రక్తం చిందించింది. అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి ఊరేగింపు సందర్భంగా కర్రలు ఉపయోగించకుండా నిషేధం విధించినా…. భక్తులు యధావిధిగా కర్రలతో ప్రత్యక్షమై.. స్వైర విహారం చేశారు.  అర్ధరాత్రి దేవరగట్టు కొండల్లో ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు వేలాది మంది భక్తులు గుంపులు.. గుంపులుగా కర్రలతో తలపడి యుద్ధభూమిని మరిపించారు.

దేవరగట్టు బన్ని ఉత్సవంలో సంప్రదాయం పేరిట కర్రలతో తలలు పగిలేలా కొట్టుకోవడాన్ని అడ్డుకునేందుకు పోలీసులు.. అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సుమారు వెయ్యి మంది పోలీసులు.. డ్రోన్ కెమెరాలు.. బాడీ ఓన్ కెమెరాలు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు… అవసరమైతే లాఠీ చార్జ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించి.. కొండ చుట్టూ అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టి తనిఖీ చేశారు. అయినా అర్ధరాత్రికి గంట ముందు భక్తులు వందలాది దుడ్డుకర్రలతో.. శబ్దాలు చేసుకుంటూ.. దూసుకొచ్చారు. భారీ సంఖ్యలో ఉన్న భక్తులను.. కొద్ది సంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు ఏమీ నిలువరించలేకపోయాయి.

పోలీసులు వెనక్కి తగ్గడంతో భక్తుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. కేరింతలు కొడుతూ.. కర్రలతో గుంపులు గుంపులగా నృత్యాలు చేశారు. ఎదురొచ్చిన వారిని కర్రలతో కొడుతూ.. గుంపులు గుంపులుగా ప్రదర్శనలు చేశారు. అర్థరాత్రి కళ్యాణోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగించేందుకు కొండ కిందకు తెచ్చిన వెంటనే ఆయా గ్రామాల ప్రజలు గుంపులు గుంపులుగా.. తలపడ్డారు. తమ గ్రామానికి ముందు తీసుకెళ్లాలంటే.. ముందు తమ గ్రామానికేనంటూ.. తోపులాడుకున్నారు. వేద పండితులు.. నిర్ణయంతో ఆయా గ్రామాల్లో వరుసగా ఊరేగించారు. నెరణికి.. నెరణికి తండ.. దేవరగట్టు గ్రామాల్లో ఊరేగించి తిరిగి కొండ వద్దకు వచ్చేలోగా తెల్లారిపోయింది.

తెల్లవార్లు సాగే కర్రల సమరాన్ని చూసేందుకు లక్షల మంది తరలిరావడంతో దేవరగట్టు కొండలు, కోనలు జనసంద్రంతో పోటెత్తాయి. ఆంక్షల కారణంగా ఈసారి కర్రల సమరం జరగదని భావించినా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. భక్తులు యధావిధిగా కర్రలతో కదం తొక్కారు. 35 మంది గాయపడ్డారు. మరో ఇద్దరికి తలలు పగిలి తీవ్ర గాయాలు కావడంతో.. ప్రాథమిక చికిత్స చేసి అంబులెన్స్ లలో ఆదోని ఏరియా ఆస్పత్రికి తీసుకుపోయారు. ముగ్గురికి కాల్చిన టైర్లు మీదపడడంతో శరీరం కాలి గాయపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates