మహా సంప్రోక్షణపై.. TTD చైర్మన్ కు అవగాహన లేదు : రమణ దీక్షితులు

మహా సంప్రోక్షణపై TTD చైర్మన్ కు అవగాహన లేదని విమర్శించారు రమణ దీక్షితులు. భక్తులను ఆలయానికి అనుమతించకూడదనే నిర్ణయం సరైనది కాదన్నారు. భగవంతున్ని భక్తులకు దూరం చేయాలనే ప్రయత్నాన్ని తప్పుబట్టారు. మహాసంప్రోక్షణ పేరుతో ఆగస్టు 9 నుంచి 16 వరకు భక్తులకు దర్శనాలు రద్దు చేస్తామన్న TTD నిర్ణయంపై.. మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మంగళవారం (జూలై-17) చెన్నైలో స్పందించారు. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసేసరికి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు.

గతంలో తాను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా.. TTD ప్రస్తుత నిర్ణయాలు ఉన్నాయన్నారు రమణ దీక్షితులు. ఇప్పటివరకు తన ఆరోపణలకు పాలకమండలి, ప్రభుత్వం జవాబు ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. ఆలయంలో రహస్యంగా సంప్రోక్షణ పూజలు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. స్వామి వారి సంపద దోచుకోవాలనే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే సీబీఐ విచారణ కోరుతున్నానని తెలిపారు. స్వామి వారికి అపచారం చేయకుండా సంప్రోక్షణ నిర్వహించాలని TTDని కోరారు రమణ దీక్షితులు.

Posted in Uncategorized

Latest Updates