మహిళకు అనారోగ్యం :  భర్తను ఇబ్బందిపెట్టలేక నదిలోకి దూకేసింది

అనారోగ్యంతో బాధపడుతున్న భార్య..భర్తను ఇబ్బందిపెట్టలేక చనిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో బైకుపై వెళ్తున్న ఆమె భర్తను బైకు ఆపమని చెప్పి, అతడిముందే నదిలోకి దూకేసింది. ఈ సంఘటన సోమవారం (జూలై-23) యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మహ్మద్ రఫీ అతడి భార్య గుల్ అఫ్షాన్ ఖతూన్ దంపతులు బాలగంజ్‌లో నివసిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం పెళ్లిచేసుకున్న వీరికి నెలరోజుల కుమార్తె ఉంది. ఇటీవల అస్వస్థతకు గురైన ఖతూన్‌ను భర్త రఫీ సోమవారం (జూలై-23) గోమతినగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 2:30 సమయంలో ఆస్పత్రి నుంచి తిరిగి వస్తుండగా సమతా ములక్ క్రాసింగ్ సమీపంలోకి రాగానే… ఖతూన్ తనకు కళ్లు తిరుగుతున్నాయంటూ బైక్ ఆపాలని కోరింది.

భర్త బైక్ ఆపగానే ఆమె వడివడిగా నడుచుకుంటూ వెళ్లి నదిలో గోమతి నదిలో దూకేసింది. వెంటనే అప్రమత్తమైన రఫీ కూడా ఆమెను కాపాడేందుకు నదిలో దూకేశాడు. ఇది గమనించిన స్థానికులు డైవర్లను అప్రమత్తం చేయడంతో వారు కూడా రంగంలోకి దిగి ఇద్దరినీ ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్న తన భార్య ప్రస్తుతం చికిత్స పొందుతోందని పోలీసులకు తెలిపాడు రఫీ. అయితే విసయం తెలుసుకున్న యూపీ ప్రభుత్వం చికిత్సకు సాయం అందిస్తామని తెలిపిందన్నారు పోలీసులు.

 

 

Posted in Uncategorized

Latest Updates