మహిళా మత్స్యకారులకూ సొసైటీలు : హరీశ్

HARISHసిద్దిపేట జిల్లాలోని చెరువులన్నీ నింపి చేపల చెరువులుగా మారుస్తామని చెప్పారు మంత్రి హరీశ్. శుక్రవారం (ఏప్రిల్-6) జిల్లాలోని వయోలా గార్డెన్‌లో  మత్స్యకారుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా మంత్రి హరీశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళారుల ప్రమేయం లేకుండా లబ్దిదారులకు నేరుగా పథకాలు అందజేసేందుకే ఈ అవగాహన సదస్సును ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లా అన్నారు. కాళేశ్వరం నీళ్లు తెచ్చి జిల్లాలోని చెరువులన్నీ నింపుతామన్నారు. నీలి విప్లవం తీసుకు వస్తామన్నారు. తెలంగాణ రాకపోయి ఉంటే ఇంకా 20 ఏళ్లయినా గోదావరి నీళ్లు రాక పోయేవని వెల్లడించారు.  గత ప్రభుత్వాలు మత్స్యకారుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులకు రూ. 25 కోట్ల బడ్జెట్ ఇస్తే.. సీఎం కేసీఆర్ రూ. 1,025 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాకు రూ. 75 కోట్లు మంజూరు చేశాం. సిద్దిపేట జిల్లాకు రూ. 18 కోట్లు మంజూరయ్యాయి. సంఘానికి రూ. 2 లక్షల రుణం ఇప్పిస్తామన్నారు. వ్యక్తిగత రుణాలకు 75 శాతం, సంఘాలకు 90 శాతం జిల్లా సంఘాలకు 100 శాతం సబ్సిడీపై రుణాలు అందజేస్తామన్నారు.

అవసరమైతే సీఎం కేసీఆర్‌కు చెప్పి మరిన్ని నిధులు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. 50 మంది సభ్యులున్న సంఘాల భవనానికి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. ప్రతి మండల కేంద్రంలో చేపలు అమ్మే కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాకు భవిష్యత్‌లో హోల్‌సేల్ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పెద్ద చెరువుల్లో రొయ్యల విత్తనాలు వేయనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తయ్యాక జిల్లాలోనే హోల్‌సేల్ చేపలమార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా కొత్తగా మహిళా మత్స్యకారుల సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు మంత్రి.

Posted in Uncategorized

Latest Updates