మహేశ్వరంలో యువకుడి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోఇవాళ ( ఆదివారం,అక్టోబర్-7) ఉదయం రాజు అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దుండగులు హత్య చేశారు.  రెండేళ్ల క్రితం పొట్ల రాజుతో కలిసి కొత్తూరుకు వెళ్లిన కృష్ణ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. కృష్ణ మృతికి రాజే కారణమని భావించిన అతడి కుటుంబసభ్యులు రాజు కుటుంబం పై కక్ష పెంచుకున్నారు. అదే ఊరిలో ఉండే రాజు ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో రాజు కుటుంబం ఆరోజు నుంచి షాద్‌నగర్‌లో నివాసముంటోంది. కృష్ణ మృతి కేసులో రాజును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో రాజు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తండ్రితో కలిసి నాగారం గ్రామానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు అతడిని బహిరంగంగా అందరూ చూస్తుండగా కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

అత్తాపూర్‌లో జరిగిన హత్యను మరవకముందే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో మరో యువకుడి హత్య జరగటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates