మాజీమంత్రి మల్యాల రాజయ్య కన్నుమూత

హైదరాబాద్‌: మాజీమంత్రి, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు మల్యాల రాజయ్య(82) బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి మేడిబావిలో నివసిస్తున్న రాజయ్య గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

1936లో కరీంనగర్‌ జిల్లా వెదిర గ్రామంలో జన్మించిన రాజయ్యకు భార్య అనసూయదేవి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.  ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, ఎల్‌.ఎల్‌.బి చేసిన రాజయ్య మొదట న్యాయవాదిగా పనిచేశారు. ఆ తరువాత చీరాల, కల్వకుర్తి, హైదరాబాద్, సిటీ సివిల్‌ కోర్టుల్లో జడ్జీగా పనిచేశారు. 1984లో రాజకీయాల్లోకి వచ్చిన రాజయ్య 1985, 1989, 1994లో టీడీపీ తరఫున అందోల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1998, 1999ల్లో సిద్దిపేట నుంచి ఎంపీగా గెలిచారు. 2006లో టీఆర్‌ఎస్‌లో చేరి కొంతకాలం తర్వాత తిరిగి టీడీపీలో వచ్చాడు.  రాజయ్య అంత్యక్రియలు ఇవాళ ఉదయం సీతాఫల్‌మండి శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సీతాఫల్‌మండి మేడిబావి గృహంలో రాజయ్య మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. రాజయ్య మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలను స్మరించుకున్నారు.  రాజయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates