మాజీలైనా మెరిశారు.. కాంగ్రెస్ సీఎంల వేడుకల్లో బీజేపీ నేతల హల్చల్

మొన్నటివరకు ఎన్నికల్లో వాళ్లు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఫలితాలు రాగానే సీన్‌ మారిపోయింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా బీజేపీ ప్రతిపక్షంలోకి మారింది. అయినా విమర్శల్లేవు. తిట్ల పురాణాల్లేవు. అంతా అలయ్‌బలయ్‌లు, ఆత్మీయ పలకరింపులే. మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్‌, రాజస్థాన్‌లో గెహ్లాట్‌, చత్తీస్ గఢ్ లో భూపేశ్‌ బఘేల్ సీఎంలుగా సోమవారం ప్రమాణం చేశారు.

ఈ వేడుకల్లో తాజా మాజీ సీఎంలు, బీజేపీ నాయకులు శివరాజ్ సింగ్‌ చౌహాన్‌, వసుంధరా రాజె, రమణ్ సింగ్‌ పాల్గొని సందడి చేశారు. భోపాల్ లో.. శివరాజ్ సింగ్‌ చిరునవ్వులు చిందిస్తూ కమల్ నాథ్ తో చెయ్యెత్తించి నినాదాలు చేయించారు. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం వసుంధరా రాజే పాల్గొన్నారు. మాజీ సీఎం మేనల్లుడైన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాను రాజ వంశీయుల సంప్రదాయం ప్రకారం వసుంధర ఆలింగనం చేసుకున్నారు. చత్తీస్ గఢ్ సీఎం గా భూపేశ్ బఘేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం రమణ్ సింగ్ హాజరయ్యారు. మూడు కార్యక్రమాల్లోనూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ పాల్గొన్నారు.

కార్యక్రమాలు కాంగ్రెస్ సీఎంలవే అయినా… బీజేపీ నేతలు కూడా మీడియా కెమెరాలను తమవైపుకు తిప్పుకుని హెడ్ లైన్స్ లో నిలిచారు. స్పోర్టివ్ పాలిటిక్స్ మంచివే అని… రాజకీయ వైరుధ్యం కన్నా.. నాయకులు ఇలా ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని నెటిజన్లు స్పందించారు.

Posted in Uncategorized

Latest Updates