మాది లక్ష్యాలు సాధించే ప్రభుత్వం : మోడీ

Modi-RSఆరోగ్య రంగంలో చేయాల్సింది ఎంతో ఉందని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభలో మోడీ మాట్లాడుతూ ఆయుష్మాన్‌ భారత్‌పై వివరణ ఇచ్చారు. దీంతో 50 కోట్ల మందికి లబ్ది కలుగుతోందన్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని తెలిపారు. ఆధార్ కార్యక్రమం 1998 లోనే ప్రారంభమైందన్న ప్రధాని మోడీ… ఈ పథకానికి అమెరికా పథకానికి ఎలాంటి పోలిక లేదని ఆయన చెప్పారు. విదేశాలతో భారత్‌ను పోల్చడం సరి కాదన్నారు.

బీజేపీని విమర్శించే క్రమంలో కాంగ్రెస్ అబద్దాలు చెబుతోందన్నారు మోడీ. కాంగ్రెస్ ప్రభుత్వాలు కుంభకోణాలకు పరిమితమయ్యాయన్న ప్రధాని… ప్రజల ఆరోగ్య  భద్రతకు కేంద్ర ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కాంగ్రెస్‌ను దేశంనుంచి తరిమేయాలన్నది తన కోరిక కాదని.. మహాత్మా గాంధీయే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని చెప్పారన్నారు. ముక్త కాంగ్రెస్‌ పదం తనది కాదని.. అది మహాత్ముడుదేనన్నారు మోడీ. పేదలకు సేవ చేయడానికి పార్టీలతో పని లేదన్నారు. మంచి సలహాలు వస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ప్రతిపక్షాలకు నవభారత్‌ అక్కరలేదని… సిఫార్సులతో వెళ్లే భారత్‌ కావాలన్నారు మోడీ. మీరు అవినీతి భారత్‌ను కోరుకుంటున్నారా? ఎలాంటి భారత్‌ను కోరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్‌ పథకంలో లోపాలు ఉండి ఉండవచ్చునని.. కాంగ్రెస్‌ సభ్యులు పరిశీలించి సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలు టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేశాయని ఆయుష్మాన్‌ భారత్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన కోరారు.

లక్ష్యాలు చేరుకునే ప్రభుత్వం తమదని..కేవలం పేర్లు మార్చే ప్రభుత్వం కాదన్నారు ప్రధాని. తమకు ప్రజలు జై కొడితే కాంగ్రెస్‌కు బాధ కలగడం సహజమేనని అన్నారు. నల్లధనం విషయంలో అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకూ 35 వేల కోట్ల రూపాయిల నల్లధనాన్ని జప్తు చేశామని చెప్పారు. నల్లధనం తీసుకురాకపోవడం కాంగ్రెస్‌ గొప్పేనని ఆయన అన్నారు. బ్లాక్‌ మనీపై సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్‌ ఘనతేనన్నారు ప్రధాని.

GSTని కాంగ్రెస్‌ బహిష్కరించిందని… అందులో ఏమైనా లోపాలు ఉంటే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎర్రకోటపై ప్రసంగంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానన్నారు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates