మార్పుకు సంకేతం పాలమూరు : కేటీఆర్

అరవై ఏండ్లకు పైగా దేశంలో.. రాష్ట్రంలో రాబందుల పాలన కొనసాగించిన కాంగ్రెస్ డబుల్ ప్రకటనలో ప్రజలను మభ్యపెడుతున్నదన్నారు మంత్రి కేటీఆర్. గురువారం (సెప్టెంబర్-27)న సాయంత్రం నాగర్‌ కర్నూల్ జిల్లా కేంద్రంలో తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన అభివృద్ధి నివేదనసభ జరిగింది. ఈ సభకు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాలుగున్నరేండ్ల TRS పాలనకు పాలమూరు సంకేతంగా నిలుస్తున్నదని చెప్పారు.

దక్షిణభారత దేశంలోని ఆరు రాష్ర్టాల్లోనూ తెలంగాణలో ఉన్న దౌర్భాగ్యపు ప్రతిపక్ష పార్టీలు మరెక్కడా లేవన్నారు. ఆయా రాష్ర్టాల అభివృద్ధి కోసం ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంతో కలిసి నడుస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వందలమందిని పొట్టన పెట్టుకొన్న కాంగ్రెస్ కు .. TJS నేత కోదండరాం 3 సీట్ల కోసం పొర్లుదండాలు పెడుతున్నారని విమర్శించారు. ఇంతకాలం కరువుకు దాసోహమైన పాలమూరు ప్రాంతంలో నిండు ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పారుతున్నాయంటే అందుకు TRS ప్రభుత్వ పనితీరు నిదర్శనమని చెప్పుకొచ్చారు. TRS సాగునీటి సంకల్పంపై కాంగ్రెస్ అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ.. సాగునీటి వసతులు కల్పించకుండా పగబట్టిందన్నారు. ఇందుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలపై పాలమూరు కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates