మాల్యాకు సుప్రీం షాక్

ఢిల్లీ: తాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థున్ని కాదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్‌ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రారంభించిన విచారణ ప్రక్రియపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు మాల్యా. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మాల్యా పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ ఈడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది కోర్టు.

పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్న మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. వివిధ ఆర్థిక నేరాలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్న ఆయనను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది భారత ప్రభుత్వం. దీనిపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు ఈ నెల పదో తేదీన తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ బ్యాంకులకు ఇవ్వాల్సిన నూరుశాతం ప్రజాధనాన్ని తిరిగి చెల్లిస్తానంటూ ఇటీవల పలు ట్వీట్లలో ప్రకటించారు మాల్యా.

Posted in Uncategorized

Latest Updates