మాల్యాను భారత్ కు అప్పగించండి: యూకే కోర్టు

బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌వేసిన విజ‌య్ మాల్యా కేసులో యూకేలోని వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు అత్యంత కీలకమైన తీర్పునిచ్చింది. మాల్యాను భారత్‌కు అప్పగించాలా వద్దా అనేదానిపై వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు క్లారిటీ ఇచ్చింది. మాల్యాను భారతదేశానికి అప్పగించాలని సోమవారం ఆదేశించింది. రూ.9 వేల కోట్ల వరకు బ్యాంకులను మోసం చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలతో ప్రస్తుతం ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఆయన ఈ దర్యాప్తును తప్పించుకునేందుకు 2016 మార్చిలో లండన్ వెళ్ళిపోయారు. దీంతో ఆయనను భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.

భారత ప్రభుత్వ అభ్యర్థనపై వెస్ట్‌మినిస్టర్ కోర్టు 2017 డిసెంబరు 4 నుంచి విచారణ జరుపుతోంది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ దర్యాప్తు చేసింది. మానవ హక్కులకు సంబంధించిన కారణాలను చూపుతూ మాల్యాను భారతదేశానికి అప్పగించేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని ఈ దర్యాప్తు నివేదిక తెలిపింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నష్టాల్లోకి వెళ్లడం తప్పదని మాల్యాకు ముందే తెలుసునని, బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పుడూ లేదని తెలిపింది. వెస్ట్‌మినిస్ట‌ర్ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ స్వాగ‌తించింది. త్వ‌ర‌లోనే మాల్యాను భార‌త్‌కు తీసుకువ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఆయ‌న కోసం ముంబైలో ప్ర‌త్యేక జైలును కూడా త‌యారు చేశారు సీబీఐ అధికారులు. కోర్టు తీర్పుపై అపీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల టైమిచ్చారు.

ఇవాళ(సోమవారం) కోర్టు తీర్పు ఉండటంతో కోర్టు దగ్గరకు వచ్చిన మాల్యా….కోర్టులోకి వెళ్లేముందు అక్కడున్న మీడియాతో మాట్లాడాడు. తాను బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలన్నింటినీ తిరిగి చెల్లిస్తానని స్పష్టం చేశాడు. ఈ అప్పగింత కేసు నడుస్తున్న కారణంగా తాను రుణాలు చెల్లిస్తానని చెప్పడం లేదని, ఈ కేసుతో దీనికి సంబంధం లేదని చెప్పాడు. ఈ సెటిల్మెంట్ ఆఫర్‌ను తాను కోర్టులోనే చేశానని…. ఆ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నాడు మాల్యా.

Posted in Uncategorized

Latest Updates