మా ఊళ్లో మా రాజ్యం : గూడేల్లో ఇవాళ్టి నుంచి స్వయం పాలన

ADIVASIలంబాడాలను ST జాబితా నుంచి తొలగించాలని గత కొన్ని నెలలుగా ఆదీవాసులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గురువారం (మే-31) సెక్రటేరియట్ లో మరోసారి చర్చించారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీతో, ఆదివాసి పోరాట సమితి అధ్యక్షుడు సోయంబాపురావు ఆధ్యర్యంలో పలువురు ప్రతినిధులు సచివాలయంలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

దీంతో ఆదివాసీ నేతలు స్వయం పాలనకు పిలుపునిచ్చారు. మావ నాటే.. మావ రాజ్‌ (మా ఊళ్లో మా రాజ్యం) అనే నినాదంతో ఆదివాసీలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. శుక్రవారం(జూన్-1) నుంచి గూడేల్లో స్వయం పాలనను ప్రకటించారు.  లంబాడాలను ST జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ 2017 డిసెంబర్‌లో ఆదివాసీలు చేపట్టిన ఉద్యమం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఉద్యమం సాగింది. 2017 డిసెంబర్‌ 15న ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఘర్షణల తర్వాత ప్రభుత్వం ఇరు వర్గాలను చర్చలకు ఆహ్వానించింది. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్పీ సింగ్‌ తోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాలో పర్యటించి ఆదివాసీలు, లంబాడాలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా జనవరి 4న ఆదివాసీలు ప్రభుత్వానికి మెమొరాండం అందజేశారు.

డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూన్‌ 1 నుంచి స్వయంపాలనకు వెళ్తామని హెచ్చరించారు. డిసెంబర్‌ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఘర్షణలు సద్దుమణిగినప్పటికీ ఆదివాసీలు ఉద్యమాన్ని శాంతియుతంగానే నిర్వహిస్తూ వచ్చారు. తుడుందెబ్బ నాయకులు చెప్పినట్లు శుక్రవారం (జూన్-1) నుంచి ఆదివాసీ గూడేల్లో స్వయం పాలన ప్రారంభించాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం (మే-31) ప్రభుత్వం చర్చలకు పిలిచింది. శైలేంద్రకుమార్‌ జోషితో చర్చల సందర్భంగా సమితి ప్రతినిధులు తమ డిమాండ్లను సీఎస్‌ ముందుంచారు. ST (షెడ్యూల్డ్‌ తెగలు) జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 342 ప్రకారం 9 తెగలను మాత్రమే ST జాబితాలో చేర్చారని, అయితే 1976 తర్వాత వలస మార్గంలో వచ్చిన లంబాడీలు అక్రమంగా ఎస్టీల్లో చేరారన్నారు. ఎలాంటి కమిషన్‌ వేయకుండా వారిని ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు.

అలాగే ఏజెన్సీ ధ్రువీకరణ పొందిన వేలాది లంబాడా యువత ఆదివాసీల ఉద్యోగాలను తన్నుకుపోయినట్లు స్పష్టంచేశారు. వారిని ST జాబితా నుంచి తొలగిస్తేనే న్యాయం జరుగుతుందని సీఎస్‌ కు తెలిపారు.  దీనిపై జోషి స్పందిస్తూ.. ST జాబితా నుంచి లంబాడీలను తొలగించడం తమ పరిధిలో లేదని స్పష్టం చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి డిమాండ్లను సీఎం కేసీఆర్‌కు వివరిస్తానని సమితి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అయితే ప్రధాన డిమాండ్‌ పై స్పష్టత రాకపోవడంతో చర్చల ప్రసక్తే లేదంటూ.. మా ఊళ్లో మా రాజ్యం అనే నినాదాలతో సమితి ప్రతినిధులు సీఎస్‌ చాంబర్‌ నుంచి  అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. శుక్రవారం(జూన్-1) నుంచి గూడేల్లో స్వయం పాలనను ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates