మా గోడు పట్టించుకోండి : ఖమ్మం జిల్లా అన్నదాతల్లో ఆందోళన

కూరగాయల విత్తనాలపై సర్కార్ సబ్సిడీని రద్దు చేయడంతో… రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విత్తనాలకు బదులు 90శాతం రాయితీతో నారును సప్లై చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా…  దానికి పరిమితి విధించడంతో రైతులు ఆసక్తి చూపించడం లేదు. ఈ విధానంలో తమకు నచ్చిన విత్తనాన్ని సాగుచేసే అవకాశం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లా అన్నదాతలు.

కూరగాయల విత్తనాలపై రాయితీని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఖమ్మం జిల్లా రైతులు మండిపడుతున్నారు. సర్కార్ నిర్ణయంతో తమకు ఆర్థిక భారం పడుతుందని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం 50 శాతం రాయితీ పై ఉద్యానవన శాఖతో విత్తనాలు సప్లై చేసేది. తాజాగా విత్తనాల స్ధానంలో కూరగాయల నారును 90 శాతం రాయితీ పై పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. దీంతో నారుపై ఇంట్రస్ట్ చూపడం లేదు ఇక్కడి రైతులు. ప్రభుత్వ నిర్ణయంతో విత్తనాలను బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందంటున్నారు. ఖమ్మం జిల్లాలోని రఘనాధపాలెం, ఖమ్మం రూరల్, చింతకాని, తల్లాడ, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, మధిర, రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కారేపల్లి , ఏన్కూరు తదితర మండలాల్లోనూ కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా సాగు చేస్తారు. అధిక పంటల సాగుతో ఇతర ప్రాంతాలకు కూడా కాయగూరలు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూరగాయల సాగు భారంగా మారిందంటున్నారు రైతులు.

కొత్తగూడెం జిల్లాలోనూ 18 వందల ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. అందుకు గాను 2 వేల 900 కిలోల విత్తనాలు అవసరం ఉంటుంది. అయితే విత్తన ఖర్చు కింద సుమారు రూ. 22 లక్షలు ఖర్చవుతుంది. రాయితీ పోను రైతుకు సుమారు రూ.11 లక్షలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో రైతులు రూ.21 లక్షలు ఖర్చు చేసి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. విత్తనాల వ్యాపారులు ధరలను పెంచితే మరింత భారం తప్పదంటున్నారు. జిల్లాలో కూరగాయల రైతుకు తగిన ప్రోత్సాహం లభించడం లేదంటున్నారు రైతులు. దీంతో ఈసారి కాయగూరల సాగు విస్తీర్ణం తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. విత్తనాల్లో  మొలక శాతం తగ్గి రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం చెబుతున్నా… రైతులు మాత్రం నారును తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఒక వేళ తీసుకున్నా… అది నాణ్యమైందా… దిగుబడి సక్రమంగా వస్తుందా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కూరగాల విత్తనాలపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటున్నారు రైతులు. సబ్సిడీ నేరుగా ఇస్తే… కూరగాయల సాగు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates