మా బీజేపీని ఓడించండి : బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా

ముజాఫర్‌నగర్‌ : రఫేల్‌ డీల్‌పై విపక్షాల ఎక్కుపెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నమోడీ ప్రభుత్వానికి స్వపక్షం నుంచే విమర్శలు వస్తున్నాయి. రఫేల్‌ డీల్‌పై బీజేపీ అసంతృప్తి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హా సొంత ప్రభుత్వం పైనే మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎంతో అనుభవపూర్వకమైన కంపెనీ హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)ను పక్కనపెట్టి, కొత్త కంపెనీని రఫేల్‌ కాంట్రాక్ట్‌కు ఎంపిక చేయడమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆయన.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజాఫర్‌నగర్‌ జిల్లా తవ్లి గ్రామంలో ఆదివారం జరిగిన వ్యవసాయదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రఫేల్‌ డీల్‌ కు ఫ్రెంచ్‌ ఏరోస్పేస్‌ దిగ్గజం దస్సాల్ట్‌ ఏవియేషన్‌కు భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ను కేంద్ర ప్రభుత్వమే ఎంపిక చేసిందని ఫ్రాన్స్‌ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే చెప్పినట్టు వెల్లడైన విషయాన్నిప్రస్తావించారు శత్రుఘ్నసిన్హా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు ఆయన. ఆ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌ సిన్హా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా హాజరయ్యారు. కాగా, రూ.58 వేల కోట్లకు పైగా విలువైన రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నాయి. 2019 ఎన్నికలకు విపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రంగా మారిందన్నారు శత్రుఘ్నసిన్హా.

Posted in Uncategorized

Latest Updates