మిడ్‌ మానేరు ద్వారా 76 వేల ఎకరాలకు నీరు: హరీష్

harish-raoమిడ్‌ మానేరు కింద 76వేల ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ప్యాకేజీల వారీగా పనుల తీరును కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. మిడ్‌ మానేరు పునరావాస చర్యల కోసం రూ.33 కోట్లకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు.

రాష్ట్రంలో చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టు పనులను ఉరకలెత్తించి నిర్దిష్ట కాలంలో సంబంధిత ఆయకట్టుకు నీరందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్‌ పనులు, భూసేకరణ, పునరావాసం పనుల తీరును మంత్రి వీడియో సమావేశం ద్వారా గురువారం(జూన్-21) సమీక్షించారు. మిడ్‌ మానేరు , ఛనాకా- కొరటా బ్యారేజి, కొమురంభీం ప్రాజెక్టు, గొల్ల వాగు, ర్యాలీ వాగు, నీలవాయి ప్రాజెక్టు, జగన్నాథపూర్, మత్తడి వాగు, సాత్నాల, స్వర్ణ, గడ్డన్న వాగు, ఎన్టీఆర్‌ సాగర్, వట్టి వాగు, పీపీ రావు, ప్రాజెక్టుల తీరును తెలుసుకొని హరీష్ అధికారులకు సూచనలు చేశారు.

ఛనాకా- కొరటా ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్‌ నాటికి నీరు నింపి 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేలా చేయాలని మంత్రి ఆదేశించారు. కొమురంభీం ప్రాజెక్టు కింద గత ఏడాది 20 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం అదనంగా మరో 5 వేల ఎకరాలకు ఇవ్వాలని, రైల్వే క్రాసింగ్‌ పనులను పూర్తి చేసి మరో 15 వేల ఎకరాలకు అందించాలన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఇంకా 280 ఎకరాల భూసేకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. దీనికి రూ. పది కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గొల్లవాగు ప్రాజెక్టులో ఫీల్డ్‌ ,చానల్స్, మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. నీలవాయి ప్రాజెక్టు లో 8 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా ఖరీఫ్‌ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు మంత్రి హరీష్.

Posted in Uncategorized

Latest Updates