మిషన్ భగీరథపై సీఎం సమీక్ష: మార్చి 31 కల్లా ప్రతి ఇంటికి నీళ్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సీరియస్ గా దృష్టి సారించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్… ప్రగతి భవన్ లో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 23,968 ఆవాస ప్రాంతాలకు గాను 23,947 ఏరియాల్లో నీరు సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు. మరో 21 గ్రామాలకు మాత్రమే నీరు అందాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం నివాసాలకు నల్లాలు బిగించినట్లు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. మార్చి 31 కల్లా మిషన్ భగీరథ పథకం ప్రతి ఇంటికి చేరాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ ఒక్కరూ కూడ మంచి నీళ్ల కోసం రోడ్లపై కనపడకుండా భగీరథ పనులు వేగవంతం చేయాలని సూచించారు.

మిషన్ భగీరథ అమలుకు ఎంత ఖర్చైనా సరే వెనుకడుగు వేసేది లేదని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. గిరిజన తండాలు దళిత వాడలు, మారుమూల ప్రాంతాలకు మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates