మీరు విన్నది నిజమే : కట్నం కోసం భార్యే చిత్రహింసలు పెడుతోంది

ఎప్పుడు చూసినా చూడు.. కట్నం కోసం భర్త వేధింపులు.. అత్తింటి చిత్రహింసలు అంటూ వార్తలు చదివీ చదివీ.. చూసీ చూసీ విసిగిపోయారు. వీళ్లు మారరు అంటూ మగాళ్ల గురించి తిట్టుకుని కూడా ఉండి ఉంటారు. ఈ వార్త మాత్రం రివర్స్. తాళి కట్టించుకున్న భార్య వేధిస్తోంది. అంతేనా.. రోజూ భర్తను చిత్రహింసలు పెడుతోంది. భయపెడుతోంది.. రాసిరంపాన పెడుతోంది ఈ భార్య. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. కేసు కూడా నమోదు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీకి చెందిన ధీరజ్ రెడ్డి.. బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మంచి జీతం.. హోదా ఉన్నాయి. బాగా డబ్బు కూడా ఉంది. భారీ లాంఛనాలతో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. మొదటి నెల హ్యాపీ.. ఆ తర్వాత భార్య అసలు రంగు బయటపడింది. డబ్బు, డబ్బు అంటూ వేధించటం మొదలుపెట్టింది. మొదట్లో భార్య కోరిక తీర్చటం కోసం అప్పులు చేసి మరీ కొనిచ్చాడు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. ఇటీవల భార్య డైమండ్ నక్లెస్ అడిగింది. దాని విలువ రూ.30లక్షలు. అంత డబ్బు లేదని చెప్పటంతో వేధింపులు మొదలయ్యాయి. డబ్బులు ఇస్తావా.. కట్నం వేధింపుల కింద కేసు పెట్టమంటావా అంటూ టార్చర్ పెట్టటం మొదలుపెట్టింది. తనకు తానుగా వాతలు పెట్టుకుని.. చిత్రహింసలు పెడుతున్నావ్ అంటూ కంప్లయింట్ చేస్తానని బెదిరించటం మొదలుపెట్టింది. రీసెంట్ గా.. మా చెల్లి పెళ్లి కోసం రూ.40లక్షలు ఇవ్వాలంటూ చేయి చేసుకునే స్థాయికి వెళ్లింది. అంతేనా.. నిన్ను చంపేస్తా.. ఆ తర్వాత ఆస్తి మొత్తం నాకే కదా అంటూ వార్నింగ్స్  కూడా ఇస్తోంది. కట్నం వేధింపులు భరించలేని ధీరజ్ రెడ్డి.. బెంగళూరులోని మహాదేవపురం పోలీసులకు భార్యపై కంప్లయింట్ చేశాడు.

ధీరజ్ రెడ్డి కంప్లయింట్ పై మొదట పోలీసులు సైతం షాక్ అయ్యారు. పైకీ కిందకీ ఎగాదిగా చూశారు. అతను చెబుతున్న విధానం, చూపించిన సాక్ష్యాలు చూసి పోలీసులు భార్య, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. దర్యాప్తు చేస్తున్నారు..

Posted in Uncategorized

Latest Updates