మీ ఇష్టం : ఇక నుంచి ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు

rationరేషన్‌ సరుకులను కేటాయించిన షాపులో కాకుండా.. మరే రేషన్‌ దుకాణంలోనైనా తీసుకునే వెసులుబాటు (పోర్టబిలిటీ) కల్పించింది రాష్ట్ర పౌరసరఫరాల శాఖ. ఈ సదుపాయం రేపటి నుంచి (ఏప్రిల్ 1, 2018) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. రేషన్ షాపుల ద్వారా లబ్ధి పొందుతున్న 2.75 కోట్ల మంది పేదలకు ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్.

ఇప్పటికే జిల్లాల పరిధిలో అమల్లో ఉన్న రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషన్ సి.వి.ఆనంద్ ప్రకటించారు. ఈ విధానం ద్వారా డీలర్ల మధ్య పోటీతత్వం పెరిగి.. లబ్దిదారులకు ఉత్తమ సేవలు అందుతాయన్నారు. కార్డుదారుడు కేటాయించిన రేషన్ దుకాణంకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. రాష్ట్రంలో ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు.

ఇంతకు ముందు కార్డుదారులు తమకు కేటాయించిన రేషన్ షాపులోనే సరుకులు తీసుకోవాల్సి ఉండేది. ఇల్లు మారినా.. కొత్త ఇంటికి దగ్గరలో రేషన్ షాపు ఉన్నా కూడా పాత షాపులోనే సరుకులు తీసుకోవాల్సి వచ్చేది. కొత్త నిర్ణయం ప్రకారం ఇకపై అలాంటి నిబంధనలేవీ ఉండవు. నచ్చిన దగ్గర లబ్ధిదారులు సరుకులు తీసుకోవచ్చు. అంతేకాదు పనుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లేవారికి పోర్టబిలిటీ ఈ విధానం చాలా ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు అడ్రస్, రేషన్ షాపు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ ఉన్నా.. ఏ రేషన్ షాపు పరిధిలో ఉన్నా తమకు నచ్చిన రేషన్ షాపులో సరుకులు తీసుకోవచ్చు. సరుకుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

గతేడాది జూన్ 1వ తేదీ నుంచి  గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని 1,545 రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. దీనికి  లబ్ధిదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ఎక్కువ మంది కార్డుదారులు తమకు నచ్చిన దగ్గర.. రేషన్ సరుకు తీసుకుంటున్నారని తెలిపారు. కేవలం 10 నెలల్లో 29 లక్షల మంది పోర్టబిలిటీని ఉపయోగించుకున్నారన్నారు. పోర్టబిలిటీతతో రేషన్ డీలర్లలో స్పష్టమైన మార్పు వచ్చిందని.. ఎక్కువమంది తమ షాపుల్లో సరుకులు తీసుకునేలా సేవలు అందించడానికి పోటీ పడుతున్నారన్నారు.

రాష్ట్రంలో 85 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 17వేల రేషన్ షాపులు ఉన్నాయి. వీటన్నింటినీ ఇప్పటికే ఆన్ లైన్ పరిధిలోకి తీసుకొచ్చారు. రేషన్ కార్డుల సమాచారంతో పాటు వారి ఆధార్ కార్డు సంఖ్యను అనుసంధానం చేశామన్నారు. ఈ విధానంలో రేషన్ షాపులకు ముందుగానే 10 నంచి 15 శాతం సరుకులను ఎక్కువగా కేటాయిస్తామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates