ముంబైలో అయితే వరదలు : నార్త్ స్టేట్స్ లో కుండపోత వానలు

rains
ఉత్తర భారతంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘర్ లోని చాలా ప్రాంతాల్లో కొండలపై నుంచి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రజలెవరికీ గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. భారీ వరదలతో సేరాఘాట్ డ్యాం కు వరద పోటెత్తింది. దీంతో హైడల్ పవర్ ప్రాజెక్టు కొద్దిగా దెబ్బతిన్నది. అటు.. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో తెహ్రీలోని బగద్దర్ కుంజాపురి దగ్గర హైవే మూసేశారు అధికారులు.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షానికి ముంబయి మహానగరం మొత్తం నీటితో నిండిపోయింది. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నడుం లోతు వరకు నీళ్లు నిలిచిపోయాయి. కింగ్ సర్కిల్, మాతుంగా, బాంద్రా లాంటి ప్రాంతాల్లో కార్లు, బైక్ లు నీటిలోనే ఆగిపోయాయి. సియాన్ రైల్వే స్టేషన్ లో ట్రాక్ పైకి నీరు చేరింది.

ఉత్తరాఖండ్ లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని చెప్పింది. చాలా వరకు కొండప్రాంతం కావడంతో.. రోడ్డు బాగున్న మార్గాల్లోనే ప్రయాణించాలని వాహనదారులకు సూచించింది. వెస్ట్ బెంగాల్ లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో సిలిగురిలో రోడ్లపై భారీగా నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సిమ్లాలో… వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. అసోంలో వర్షాలు తగ్గినా.. వరద ప్రభావం మాత్రం కంటిన్యూ అవుతోంది. శివసాగర్ లో చాలా ఇళ్లలో ఇప్పటికీ నీరు నిలిచి ఉంది. దీంతో జన జీవనం ఇబ్బందిగా మారింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ హిమాలయాలపై చురుగ్గా ఉండటంతో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, బిహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ వానలు పడే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది.

Posted in Uncategorized

Latest Updates