ముంబై ESI లో అగ్నిప్రమాదం: 8కి పెరిగిన మృతులు

ముంబైలోని ఈఎస్ఐ హాస్పిటల్ లో నిన్న(సోమవారం) జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈ ప్రమాదంలో నిన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఇవాళ మృతి చెందారు. మృతుల్లో 5 నెలల చిన్నారి కూడా ఉంది. అంధేరిలోని కామ్ ఘర్ లో ఉన్న ఈ హాస్పిటల్ నాలుగో అంతస్తులో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తులో చెలరేగిన మంటలు ఇతర అంతస్తులకు కూడా వ్యాపించింది. దీంతో హాస్పిటల్ సిబ్బంది,రోగులు అధిక సంఖ్యలో మంటల్లో చిక్కుకుపోయారు.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని 10 ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు 140 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షలు,తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు,స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.లక్ష నష్ట పరిహారాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates