ముజఫర్‌ పూర్‌‌ షెల్టర్ హోం కేసులో కీలక మలుపు

సంచలనం సృష్టించిన ముజఫర్‌ పూర్‌‌ షెల్టర్ హోం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుని విచారిస్తోన్న సీబీఐ అధికారులు…సికందర్‌ పూర్‌ ఏరియాలోని శ్మశానంలో ఓ అస్థిపంజరాన్ని గుర్తించారు. దీన్ని వసతి గృహానికి చెందిన బాలిక అస్థిపంజరంగా భావిస్తున్నారు. ఈ అస్థిపంజరానికి ఫోరెన్సిక్‌ పరీక్షలు, డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ల్యాబ్‌ రిపోర్ట్‌ తరువాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన బ్రజేష్‌ ఠాకూర్‌ డ్రైవర్‌ తెలిపిన వివరాలతో ఈ అస్థిపంజరాన్ని గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు.
ముజఫర్‌ పూర్‌ వసతి గృహంలో 40 మందికి పైగా బాలికలపై అత్యాచారాలు జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రజేష్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి నడుపుతున్న ఎన్జీవో ఆధ్వర్యంలోని వసతి గృహంలో ఈ దారుణాలు జరిగాయి. ఈ కేసులో బీహార్ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మంజూవర్మ భర్త ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగస్టులో ఆమె మంత్రిపదవికి రాజీనామా చేశారు.

Posted in Uncategorized

Latest Updates